మనిషికి కనీస అవసరాలు తీరాకనే అసలు కధ మొదలవుతుంది. మొదట ఓ మొబైల్, వాహనం, సొంత ఇల్లు, బ్యాంక్ బ్యాలన్స్… వగైరాలతో రెండో దశలోకి చేరుకుంటారు. అవి తీరిన తర్వాత మరింతగా ఎదగడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ దశకు చేరుకునేవరకు పోటీ ఆరోగ్యకరంగా లేదా సహించి భరించగల స్థాయిలోనే సాగుతుంది.
సాధారణంగా సామాన్య మధ్య తరగతి ప్రజలు ఈ దశకు చేరుకుంటే చాలనుకుంటారు. తర్వాత కుటుంబం, ఆరోగ్యం, తీర్ధయాత్రలు, విహారయాత్రలతో వారి జీవితం పరిపూర్ణం అవుతుంది.
కానీ ఈ దశ కూడా దాటి ముందుకు సాగగలిగేవారు అతికొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు వంటివారుంటారు.
ఆ స్థాయికి ఎదిగిన తర్వాత విజయం, కీర్తి ప్రతిష్టలు అవసరం అనిపిస్తాయి. కనుక అప్పటి నుంచే వారి జీవితంలో పరుగు, పోటీ మొదలవుతాయి. అవి అంతకంతకు పెరుగుతూనే ఉంటాయి తప్ప ఎన్నడూ ఆగవు.
ఆ పరుగులో అలిసిపోయినవారు, తాము ఇంత దూరం వచ్చామనే విషయాన్ని మరిచి, నిరాశ నిస్పృహతో కొందరు తీవ్ర నిర్ణయాలకు కూడా వెళ్తుంటారు. మరికొందరు మనశాంతి కోసం గుళ్ళు, గోపురాలు, స్వామీజీలు, బాబాల చుట్టూ తిరుగుతుంటారు.
కనుక విజేతలు ఎవరు? విజయానికి కొలమానం ఏమిటి? అనే రెండు ప్రశ్నలకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా చక్కటి జవాబు ఇచ్చారు.
“నేనొక వ్యాపారవేత్తను అనుకోండి. నా టర్నోవర్ 500 కోట్లు అనుకోండి. అప్పుడు నేను ఒక రతన్ టాటా లేక అంబానీనో లేక అజీమ్ ప్రేమ్ జీ స్థాయి చేరుకుంటే తప్ప నేను విజయం సాధించానట్లేనా?
నేను నటుడిని కనుక షారుఖ్ ఖాన్ స్థాయి చేరుకుంటేనే నటుడుగా విజయం సాధించినట్లా? దేశంలో 140 కోట్ల జనాభాలో ఓ 10-15 మందికి మాత్రమే హీరోగా నటించే అవకాశం వస్తుంది. నాకు ఆ గొప్ప అవకాశం వచ్చింది. నాకు సంబంధించినంత వరకు నా జీవితంలో ఇది చాలా గొప్ప విజయమే కదా? ఇంతకంటే ఏమి కావాలి?” అని అన్నారు.
అక్షయ్ ఖన్నా చెప్పింది అక్షరాల సత్యమని అందరికీ తెలుసు. మనిషికి ఆశావాదం ఎంత అవసరమో అత్యాశ లేదా దురాశ అంత ప్రమాదం.
అంతరిక్షంలోకి ఓ చిన్న ఉపగ్రహాన్ని పంపించడానికి చాలా భారీ రాకెట్ ఉంటుంది. అది నింగిలోకి దూసుకుపోతూ ఒక్కో దశకు చేరగానే దాని పని పూర్తయిపోతుంది. కనుక ఒక్కో భాగం విడిపోయి కింద పడిపోతుంటుంది. ఉపగ్రహాన్ని అంతిమ కక్ష్యలోకి చేర్చడమే వాటి పని తప్ప ఉపగ్రహంతో పాటు ప్రయాణించడం కాదు.
ఒక్కో దశలో రాకెట్ భాగాలు ఏవిధంగా విడిపోతూ ఉపగ్రహాన్ని లక్ష్యానికి చేరుస్తాయో, అదేవిధంగా మనుషులు కూడా ఒక్కో దశని దాటుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు తెలిసో తెలియకుండానో చాలా వదిలేసుకుంటారు. కొందరు ఆరోగ్యం, కొందరు బంధాలు, కొందరు మనశాంతి… వదిలేసుకుంటారు.
కానీ లక్ష్యం చేరుకున్నాక అన్ని త్యాగాలు అనవసరమనిపించవచ్చు. అప్పుడు వాటన్నిటినీ పునరుద్దరించుకోలేకపోయినా కొన్నిటిని అంటే బంధాలు, ఆరోగ్యం, మనశాంతి వంటివి పునరుద్దరించుకోవచ్చు… ఎక్కడో అక్కడ విజయంతో తృప్తి చెంది ఆగిపోగలిగితేనే అది సాధ్యం!
మన లక్ష్యం చేరుకున్నామా లేదా? ఈ విజయంతో కలిగే ఈ తృప్తి, ఈ సంతోషం సరిపోతుంది కదా? అని అక్షయ్ ఖన్నాలా ఆత్మపరిశీలన చేసుకొని పరుగు ఆపగలిగితేనే జీవితం సంతృప్తిగా సంతోషంగా ఉంటుంది.







