ప్రస్తుత కాలంలో సెల్ఫీ కోసం ప్రాణాలు తీసుకుంటున్న వారున్నారు. ప్రపంచమంతా సెల్ఫీమయం అయిపోయిన నేపధ్యంలో ‘అల్లరి’ నరేష్ ఈ ‘సెల్ఫీ’ని వాడేసుకుంటూ ఓ సినిమా తెరకెక్కించేస్తున్న విషయం తెలిసిందే. సిట్యూయేషన్ ఏదైనా సెల్ఫీతో సందడి చేసే అల్లరి నరేష్ టీజర్ ను ఇప్పటికే ప్రేక్షకులు వీక్షించారు. అయితే తాజాగా ఈ అల్లరోడు పుట్టినరోజు సందర్భంగా “సెల్ఫీ రాజా” పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఓ చేతిలో పామును మరో చేతిలో ల్యాండ్ లైన్ ఫోన్ ను పట్టుకుని సెల్ఫీ దిగుతున్న పోస్టర్ కామెడీగా ఉంది. అయితే పోస్టర్ తీర్చిదిద్దిన విధానం మాత్రం వీక్షకులకు తీవ్ర నిరుత్సాహపరిచింది. పాము పట్టుకున్న తీరు, వెనుకాల ఉన్న బ్యాక్ గ్రౌండ్ డిజైన్ అంతా సహజత్వానికి దూరంగా ఉంది. సాధారణ స్థాయి ఫోటోషాప్ తెలిసిన వారు కూడా ఇంతకంటే నైపుణ్యంగానే పోస్టర్ ను రూపకల్పన చేయవచ్చు.
అలాంటిది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే సినీ వర్గాలకు చెందిన వారు ఇంత చీప్ క్వాలిటీలో.., అది కూడా ఒక హీరో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ విడుదల చేయడం అత్యంత శోచనీయం. పోస్టర్ ఎలా ఉన్నా గానీ, అల్లరి నరేష్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ… కావాల్సిన విజయాన్ని ఈ ‘సెల్ఫీ రాజా’ ఇస్తాడని ఆశిద్దాం.



