అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఈవిదంగా ఎందుకు వ్యవహరించింది?అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖ ఉంది.
కనుక తన అనుమతితోనే ఈ అరెస్ట్ జరిగిందని ఆయనే స్వయంగా చెప్పారు. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. నిన్న సాయంత్రం ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ ‘ఆజ్ తక్’ ఇంటర్వ్యూలో పాల్గొనప్పుడు “అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా?తొందరపాటు కాదా? వేరే కారణాలున్నాయా?” అని జర్నలిస్ట్ సూటిగానే సిఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
డానికి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, “అల్లు అర్జున్ మేనమామ చిరంజీవి మా కాంగ్రెస్ నేత. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర రెడ్డి మా పార్టీలోనే ఉన్నారు. వారు మాకు బంధువులు కూడా. కనుక అల్లు అర్జున్‌ని కావాలని మేము ఎందుకు అరెస్ట్ చేస్తాము?
అయినా పుష్ప-2 సినిమా విడుదలవుతున్నప్పుడు ముందుగా టికెట్ ఛార్జిలు అదనంగా మరో రూ.800లు పెంచుకునేందుకు నా ప్రభుత్వమే అనుమతించింది కదా?అప్పుడు అందుకూ అందరూ మమ్మల్నే విమర్శించారు కదా?” అని ప్రశ్నించారు.
ఇంకా ఏమన్నారంటే, “రాష్ట్ర హోంశాఖని కూడా నేనే చూస్తున్నాను. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయి, ఆమె కుమారుడు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతుంటే, అల్లు అర్జున్ పెద్ద హీరో కనుక నేను చూసీ చూడన్నట్లు ఉండిపోవాలా?
ఒకవేళ నేను అలా చేస్తే అప్పుడు కూడా అందరూ నన్నే కదా విమర్శిస్తారు? చనిపోయిన ఆ మహిళ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నాపై ఉంటుంది. అవతలి వ్యక్తి సినిమా స్టారా.. పొలిటికల్ స్టారా?అని చూసి అరెస్టులు చేయము. నేరాన్ని బట్టే నిర్ణయాలు ఉంటాయి,” అని స్పష్టం చేశారు.
ఎందుకు అరెస్ట్ చేశారనే ప్రశ్నకు సమాధానమిస్తూ, “ఆరోజు అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వచ్చినప్పుడు ర్యాలీ చేయకుండా వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతే తొక్కిసలాట జరిగి ఉండేది కాదు. ఆ మహిళా చనిపోయేదీ కాదు. కానీ అల్లు అర్జున్ థియేటర్ వద్దకు ర్యాలీగా వచ్చి హడావుడి చేయడం వల్లనే తొక్కిసలాట జరిగింది. దానిలో ఆ మహిళ చనిపోయింది. కనుక ఆమె మృతికి ఆయన కూడా కారకుడే కదా?
అందుకే చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకున్నారు తప్ప వేరే ఉద్దేశ్యంతో అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో పలువురిని పోలీసులు ఆయన ఒక్కరినే అరెస్ట్ చేయలేదు. మరో పది మందిని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌ని ఏ-11గా పేర్కొన్నారు తప్ప ఏ-1 అని పేర్కొనలేదే?” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మాట్లాడుతూ, “అల్లు అర్జున్ పెద్ద హీరో కావచ్చు. ఆయన భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదించుకుంటున్నారే తప్ప భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద యుద్ధం చేయడం లేదు కదా?
ఇదివరకు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వంటి పెద్ద నటులని పోలీసులు అరెస్ట్ చేశారు కదా? కానీ అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసేసరికి అందరూ ఎందుకు ఇంతగా ఉలిక్కి పడుతున్నారు?ఇంత తీవ్రంగా ఎందుకు స్పందిస్తున్నారు?” అని సిఎం రేవంత్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు.
సిఎం రేవంత్ రెడ్డి వాదన సహేతుకంగానే అనిపిస్తున్నాయి కానీ ఓ ఉగ్రవాదినో లేదా ఓ కరడు గట్టిన హంతకుడినో అరెస్ట్ చేసిన్నట్లుగా అల్లు అర్జున్‌ని అలా అరెస్ట్ చేయడం అవసరమా?అని అందరూ ప్రశ్నిస్తున్నారు.
ఆయనకు హైకోర్టు 4 వారాల పాటు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తూ, “అల్లు అర్జున్ పెద్ద హీరో అయినంత మాత్రాన్న ఆయనపై పోలీసులు ఇన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం సరికాదు. సామాన్య పౌరులకు ఉండే అన్ని హక్కులు ఆయనకు కూడా ఉంటాయి. ఈ సెక్షన్స్ ఆయనకు వర్తించవు. రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు,”అంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పిన్నట్లే కదా?




