ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విజయవాడ, గుంటూరు నగరాలతో అనుసంధానిస్తూ నిర్మిస్తున్న సీడ్ యాక్సిస్ రోడ్ పనులు పూర్తయ్యాయి. కనుక ఈ నెల 13న సిఎం చంద్రబాబు నాయుడు దీనిని ప్రారంభించబోతున్నారు. దీని కోసం సీఆర్‌డీఏ, సంబంధిత శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అమరావతిలోని హైకోర్టు, సచివాలయం, శాసనసభతో పాటు పలు ప్రధాన కార్యాలయాలను అనుసంధానిస్తూ నిర్మించబడింది. కనుక ఇది అందుబాటులోకి వస్తే చుట్టుపక్కల జిల్లాల నుంచి రాజధాని అమరావతికి రాకపోకలు మరింత సులభం అవుతాయి.
జగన్ ప్రభుత్వం అమరావతిని దానిలో అనేక భవనాలను 5 ఏళ్ళు పాడుబెట్టినప్పటికీ, చంద్రబాబు నాయుడు మళ్ళీ సిఎంగా బాధ్యతలు చేపట్టగానే అన్నిటి నిర్మాణ పనులు పునః ప్రారంభించి వేగవంతం చేశారు.
వాటిలో ముందుగా సీఆర్‌డీఏ కార్యాలయం పూర్తికాగా, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ కొరకు నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు పూర్తయ్యాయి. కనుక వాటిని సీఆర్‌డీఏ ఈ నెల 13నే సాధారణ పరిపాలనశాఖకు అప్పగించబోతోంది. అత్యాధునిక సదుపాయాలతో పర్యావరణ హితంగా వీటిని నిర్మించారు.
ఇక అమరావతిలో క్వాంటం వ్యాలీ బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. దీనికి ఈ ఏడాది ఫిబ్రవరిలో సిఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి డా.జితేంద్ర సింగ్ కలిసి భూమిపూజ చేశారు.
ఉద్దండరాయుని పాలెంలో 50 ఎకరాల విస్తీర్ణంలో 90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ‘క్వాంటం వ్యాలీ’ భవన సముదాయాలను నిర్మించబోతోంది. దీనిలో ప్రఖ్యాత ఐబీఎం, టిసీఎస్, ఎల్&టి కంపెనీలు భాగస్వాములుగా ఉన్నాయి.
క్వాంటం వ్యాలీ నిర్మాణ బాధ్యతలు ఎల్&టి కంపెనీ, దానిలో క్వాంటం టెక్నాలజీ ఏర్పాటు బాధ్యత ఐబీఎం చేపడుతున్నాయి. క్వాంటం వ్యాలీలో 136 క్యూబిట్ల సామర్ధ్యంతో ఐబిఏం హెరాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్నారు.
ఏడాదిన్నరలోగా ‘క్వాంటం వ్యాలీ’ నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇది అందుబాటులోకి వస్తే దీనిలో క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, డీప్‌టెక్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు, శిక్షణ, సేవలు లభిస్తాయి. ఈ ఒక్క క్వాంటం వ్యాలీ ద్వారానే సుమారు 88,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి.
భోగాపురం మొదలు విశాఖలో ఏర్పాటవుతున్న సింధూ అకాడమీ వరకు అన్నిటి క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అమరావతిని వ్యతిరేకిస్తూ మావిగన్ అంటున్నారు. కనుక వీటన్నిటి క్రెడిట్ క్లెయిమ్ చేసుకోలేరు. అలాంటి పరిస్థితులలో ఆరోపణలు చేస్తుంటారు.
లక్షల కోట్ల ప్రజాధనం అంతా తీసుకువెళ్ళి అమరావతిలో దుబారాగా ఖర్చు చేసేస్తున్నారని వైసీపీ పాట పాడుతూనే ఉంది. కనుక అమరావతిలో ఇకపై జరిగే ప్రతీ ప్రారంభోత్సవానికి ఆ పాట బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తూనే ఉంటుందేమో?




