జగన్ మోహన్ రెడ్డి కి వీర విధేయుడు అనిపించుకోవడానికి వయస్సుకి, అనుభవానికి, తన సామజిక వర్గానికి కూడా కనీస గౌరవ, మర్యాద కూడా ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీల నేతల మీద విమర్శల దాడి చేసే అంబటి రాంబాబు ఇప్పుడు సొంత పార్టీ అధినేత జగన్ మీదే ‘మోసగాడు’ అంటూ ముద్ర వేసాడు.
పవన్ పై తమ మాటల ఘాటుతో రెచ్చిపోతూ జగన్ మోహన్ రెడ్డి ని ప్రసన్నం చేసుకుని మంత్రి పదవి సాధించుకున్న అంబటికి ఇప్పుడు అదే నోరు తిప్పలు తెచ్చిపెట్టింది. 2024 లో వైసీపీ తరుపున టికెట్ సాధించాలి అంటే అంతకు మించి అనే ఆప్షన్ ను నేతల ముందుంచారు జగన్. దానిని కూడా ఫుల్ ఫిల్ చేయడంలో భాగంగా పవన్ తో పాటుగా అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పై కూడా విమర్శల దాడి పెంచారు ఈ అంబటి గారు.
అయితే జగన్ ను మెప్పించడానికి ఎంత దిగజారిన ఇంకా జగన్ ఆశీస్సులు అంబటికి దక్కలేదు. అయితే మనస్సులో ఇంత బాధను, ఆవేశాన్ని దిగమింగుకొని బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ ఏర్పాటు చేసిన సిద్ధం సభకు విచ్చేసారు అంబటి. అయితే ఆ సభలో తనవంతు ప్రసంగానికి సమయం రావడంతో జగన్ ముందు బాబు, పవన్ లపై విమర్శలు చేసి అధినేత మెప్పు పొందాలని చూసిన అంబటి…తన మనస్సులో జగన్ మీద ఉన్న ఆవేశాన్ని, ఆక్రోశాన్ని దాచిపెట్టలేకపోయారో ఏమో కానీ ఇలా పుసుక్కున లక్షలాది ప్రజల ముందు జగన్ పై నోరుజారేసారు.
ఇవాళ రాష్ట్రంలో తేల్చుకోవాల్సింది ఒకే ఒక్క అంశం…ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన మోసగాడు జగన్ మోహన్ రెడ్డి గారు. వచ్చే ఎన్నికలలో మీకు ఈ మోసగాడు కావాలా లేదా అని తేల్చుకోవాల్సిన పరిస్థితి ప్రజలది అంటూ….’గారు’ అనే మర్యాదను జోడించి మరి జగన్ పరువు తీశారు అంబటి. 15 లక్షల మందితో సిద్ధం సభ విజయవంతమైంది అంటూ వైసీపీ చెపుతున్న గణాంకాల ఆధారంగా చూసుకుంటే ఈ 15 లక్షల మంది ప్రజల సాక్షిగా జగన్ ను ఒక మోసగాడిగా ప్రకటించారు మంత్రి అంబటి.
అయితే అంబటిగారు ఇన్నాళ్లకు మీకు ప్రజలకు నిజం చెప్పే అవకాశం, చేసిన తప్పు ఒప్పుకునే ధైర్యం వచ్చినందుకు మీకు అభినందనలు సారూ అంటూ అంబటి జగన్ పై చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు జనసైనికులు. మొత్తానికి జగన్ మోస బుద్దిని చివరిలో అయినా బయటపెట్టినందుకు సంతోషం అంబటి అంటూ అటు టీడీపీ సోషల్ మీడియా కూడా అంబటి వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి.
దీనిమీద కూడా ఒక్క వెటకారపు పోస్ట్ షేర్ చేయొచ్చుగా అంబటి అంటూ మంత్రి గారిని టీజ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలా అంబటి వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఇక అధినేత జగన్ దగ్గర అంబటికీ ఎన్ని తిప్పలు ఎదురవుతాయో..? ఇన్నాళ్లు జగన్ మీద ప్రేమ కురిపించి ఇప్పుడు ఇలా అన్న పరువు తీసావే ఎంత పని చేశావయ్యా రాంబాబు…అంటూ తలలు పట్టుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు. నోరుందికదా అని అందరి పై అవసరానికి మించి దాన్ని వాడితే వాటి పర్యవసానాలు ఇలానే ఉంటాయి అంటున్నారు ప్రతిపక్ష నేతలు.




