అమితాబ్ బచ్చన్‌తో ఆటలా?

Amitabh Bachchan KBC

అమితాబ్ బచ్చన్‌ బాలీవుడ్ నటుడు కావచ్చు. కానీ దేశ ప్రజలందరి వాడు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయనకు జేజేలు పలుకుతారు. ఆయన అద్భుతమైన నటన, హుందాతనం, క్రమశిక్షణ, హాస్యచతురత వంటివి ఆయనని భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక వ్యక్తిగా చేశాయి.

అలాంటి పెద్ద మనిషి పట్ల 5వ తరగతి చదివే ఓ బాలుడు చాలా అవమానకరంగా ప్రవర్తించాడు. తప్పుగా ప్రవర్తిస్తున్నని తెలుసుకునే వయసు కాదు ఆ బాలుడిది…. అని అమితాబ్ బచ్చన్‌కి తెలుసు. కనుక చాలా హుందాగా ఆ బాలుడు తన తప్పు తెలుసుకునేలా చేశారు.

ADVERTISEMENT

ఈ సంఘటన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ సీజన్ 17లో జరిగింది. గుజరాత్‌లోని గాంధీ నగర్‌కు చెందిన 10 ఏళ్ళు వయసున్న ఇషిత్ భట్ అనే పిల్లాడు ఈ హాట్ సీట్‌ దక్కించుకున్నాడు. తాను అమితాబ్ బచ్చన్ వంటి గొప్ప వ్యక్తి ముందు కూర్చున్నాననే విషయం కూడా అతనికి తెలియదు.

తెలియకపోయినా వయసులో తన కంటే పెద్దవారితో ఏవిదంగా వ్యవహరించాలో తల్లి తండ్రులు నేర్పించే ఉంటారు. కానీ ఆ బాలుడు అమితాబ్ బచ్చన్ ప్రశ్న అడుగుతుంటేనే, “నేనంత తెలివి తక్కువవాడిని అనుకుంటున్నారా? మీ ఆప్షన్స్ నాకు అవసరం లేదు… ఫలాన జవాబు లాక్ చేయండి,” అంటూ గదమాయిస్తున్నట్లు చెప్పాడు.

ఈ షోలో మొదటి మూడు, నాలుగు ప్రశ్నలు కాస్త సులువుగానే ఉంటాయి. కనుక ఆ పిల్లాడు నాకన్నీ తెలుసనే ధీమాతో చాలా దూకుడుగా మాట్లాడాడు. అతని తీరు చూసి ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోతూనే ఉన్నారు. కానీ అమితాబ్ బచ్చన్ మాత్రం హుందాగా గేమ్‌ కొనసాగిస్తూ 5వ ప్రశ్న అడిగారు.

నాకన్నీ తెలుసనే అహంభావంతో వ్యవహరించిన ఆ పిల్లాడు దానికీ జవాబు తెలియకపోవడంతో ‘ఆప్షన్స్’ చెప్పమని ఆయనని కోరడంతో అందరూ పక్కున నవ్వారు. కానీ అమితాబ్ బచ్చన్ వెటకారంగా మాట్లాడలేదు. ఒక్క నిమిషం మౌనంగా ఆ పిల్లాడిని చూస్తుండి పోయారు.

అది చూసి స్టూడియోలో ఆ షోలో ఉన్నవారు, టీవీలో చూస్తున్నవారు కూడా నవ్వుకున్నారు. ఆ పిల్లాడికి చాలా హుందాగా బుద్ధి చెప్పారని చాలా మంది అభిప్రాయపడ్డారు.

కానీ అప్పటికీ ఆ పిల్లాడు తనని చూసి అందరూ ఎందుకు నవ్వుతున్నారో గ్రహించలేకపోయాడు. ఎందుకంటే ఆ వయసు అలాంటిది.

అమితాబ్ బచ్చన్ 5వ ప్రశ్నకి నాలుగు ఆప్షన్స్ చెప్పగానే ఆ పిల్లాడు మళ్ళీ అలాగే ప్రవర్తించాడు. ఆప్షన్:4 లాక్ చేయమన్నాడు. అది తప్పని అమితాబ్ బచ్చన్‌కి తెలుసు. కనుక ‘ఇది సరైన సమాదానమేనా? లాక్ చేయమంటావా?”అని మళ్ళీ అడిగారు.

అప్పుడు ఆ పిల్లాడు “ఒకటి కాదు నాలుగు తాళాలు వేసి లాక్ చేయండి,” అని గట్టిగా చెప్పాడు. దానిని అమితాబ్ బచ్చన్ లాక్ చేశారు. ఆ సమాధానం తప్పు కావడంతో అ పిల్లాడు తల దించుకున్నాడు. కానీ అప్పుడు కూడా అమితాబ్ బచ్చన్ ఆ బాలుడితో హుందాగానే వ్యవహరిస్తూ సాదరంగా బయటకు సాగనంపారు. దటీజ్ అమితాబ్ బచ్చన్!

ADVERTISEMENT
Latest Stories