‘కాల్ మనీ’ వ్యవహారంలో బయటపడే నేతలెంత మంది?

andhra-pradesh-dgp-clean-chit-to-call-moneyఆంధ్రప్రదేశ్‌ని కుదిపేస్తోన్న కాల్‌మనీ వ్యవహారంపై తీగలాగితే డొంక కదులుతోంది. ఇది విజయవాడ, గుంటూరుకి మాత్రమే పరిమితం కాలేదు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు.. అటు రాయలసీమకు కూడా విస్తరించింది. విజయవాడలో మంగళవారం వివిధ ప్రాంతాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో దాదాపు 40 కాల్‌మనీ గ్యాంగ్స్ వున్నట్లు తేలింది. ప్రతీ గ్యాంగ్‌లో బౌన్సర్లతో పాటు 20 మంది సభ్యులు వున్నారట. డబ్బులివ్వని వారిని బౌన్సర్లు ఎత్తుకొచ్చి ఆస్తులు రాయించుకున్నట్లు తేలింది.

ఆయా గ్యాంగ్‌లపై మూడు రోజులుగా నిఘా పెట్టిన పోలీసులు, దాదాపు 57 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో అన్ని పార్టీల నేతల ప్రమేయమున్నట్లు అధికారుల వర్గాల సమాచారం. ప్రాంతాలను పంచుకుని ఈ దందా సాగిస్తున్నారట. ఇప్పటికే నిందితులను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నాయి. పోలీసులు రంగంలోకి దిగడంతో కాల్‌మనీ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఈ వేడి తగ్గిన తర్వాత రావచ్చని బయటకు రావచ్చని అంచనా వేసుకుంటున్నారు. అలాగే విశాఖ, తూర్పుగోదావరి, కడప, నెల్లూరు జిల్లాల్లో కాల్‌మనీ గ్యాంగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఒక్కో ఏరియాలో ఒక్కోపేరు మీద సాగుతోన్న ఈ యవ్వారంలో ఎంతమంది నేతలు బయట పడతారో చూడాలి.

ఇదెలా ఉంటే, కాల్‌‌మనీ వ్యవహారంపై ఇంటాబయటా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న కాల్‌మనీ ఉదంతంపై పూర్తి వివరాలు అందజేయాలంటూ ఏపీ చీఫ్ సెక్రటరీ, డీజీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం- ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. ఆర్థిక అక్రమాలు, మహిళలతో బలవంతంగా నిర్వహించిన సెక్స్ రాకెట్‌ను అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడిస్తూ రెండు వారాల్లోగా తెలియజేయాలని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేవీపీ, సుబ్బిరామిరెడ్డి, జైరాంరమేష్, జేడీ శీలం, రఘువీరారెడ్డిలతో కూడిన ఓ బృందం ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ సిరియక్ జోసెఫ్‌ను మంగళవారం కలిసింది. ఈ వ్యవహారంపై కొద్ది రోజులుగా న్యూస్ పేపర్లలో వస్తున్న కథనాలతో పాటు సంబంధిత వివరాలను నేతలు అందజేశారు. దీనిపై స్పందించిన ఛైర్మన్.. ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం ఏపీ స్వయంగా పర్యటించి వివరాలు సేకరిస్తుందని హామీ ఇచ్చారు.

ADVERTISEMENT
Latest Stories