ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ సర్వేలు అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజే వేరు. అయితే ఆయన మొట్టమొదటి సారిగా గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఘోరంగా దెబ్బ తిన్నారు. తెరాస సునాయాసంగా గెలిచిన ఎన్నికలలో ఆయన మహాకూటమి గెలుస్తుందని చెప్పారు. దీనితో పరువు పోయింది. తెలంగాణాలో గురి తప్పినా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి ఆయన సర్వే కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఒకసారి పప్పులో కాలేసిన లగడపాటి ఈసారి కసిగా పని చేస్తున్నట్టు సమాచారం. ఈ సారి కరెక్టు ఫలితం చెప్పగలనని ఆయన ధీమాగా ఉన్నారు. లగడపాటి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. గతంలో ఆయన తన సర్వే ఫలితాలు ఎన్నికల తరువాతే వెల్లడించినా సన్నిహితులు పర్సనల్ గా కలిసి అడిగితే వారితో ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి కొంత మేర హింట్ ఇచ్చేవారట. అయితే ఇప్పుడు అలా కూడా చెయ్యడం లేదని సమాచారం. మే 19న తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలు వెల్లడిస్తానని ఎవరు అడిగినా చెబుతున్నారట.
సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడతల పోలింగ్ పూర్తి అయ్యేవరకూ సర్వేలు విడుదల చెయ్యకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్ రూల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆయన తన సర్వే ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపినట్టు తెలుస్తుంది. మే 23న ఎన్నికల కౌంటింగ్ జరిపి అదే రోజు ఫలితాలు వెల్లడి చెయ్యబోతుంది ఎన్నికల సంఘం. కౌంటింగు కోసం ఇప్పటికే భారీ కసరత్తు మొదలు పెట్టాయి ప్రధాన పార్టీలు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ లు తమ కౌటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నాయి.



