andhra pradesh tuni train firing caseఓ పక్కన ప్రభుత్వ ఉద్యోగులు లక్షల సంఖ్యలో విజయవాడ రోడ్లపై జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వమేమో తుని రైలు దహనం కేసుకు సంబంధించిన కేసులను ఎత్తివేసే పనిలో నిమగ్నం అయ్యింది. తన సొంత మీడియాలో కూడా గురువారం నాడు ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ కధనాలు ప్రసారం చేసారు.

ఈ రైలు దహన కార్యక్రమంలో పాలు పంచుకుంది ఒక్క కాపు వర్గానికి చెందిన వారేనట, వారిపై ఉన్న కేసులన్నీ ఎత్తివేయడంతో అందుకు కృతజ్ఞతగా కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు విజయవాడలో జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. అంతేకాదు చెప్పింది చేయడం అంటే జగన్ నైజంగా ఏపీ సీఎంపై ప్రశంసలు కురిపించారు.

కాపుల కోసం ఇంత మంచి చేసిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై స్పందించడానికి పవన్ కళ్యాణ్ కు మనసు రాలేదంటూ మండిపడ్డారు. అలాగే చంద్రబాబు రాసిచ్చింది చదవడం తప్ప పవన్ కళ్యాణ్ కు మరొకటి రాదన్న అభిప్రాయాన్ని సదరు కాపు కార్పొరేషన్ నేతలు జనసేన అధినేతను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.

కాసేపు పవన్ కళ్యాణ్ విషయం పక్కన పెడితే, చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానించిన 5% కాపు రిజర్వేషన్ ను అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కన పెట్టేసిన జగన్ గురించి నాడు ఎందుకు స్పందించలేదో చెప్తే బాగుండేది. అలాగే ‘మాట తప్పడంటూ’ జగన్ కు కితాబిచ్చిన వారంతా, కాపు కార్పొరేషన్ కు జగన్ ఎందుకు నిధులు ఇవ్వలేదో కూడా చెప్తే సబబుగా ఉండేదేమో.

ఇక పవన్ కళ్యాణ్ స్పందనకు వస్తే, ఒక కులానికి ఆపాదిస్తూ చేసే కార్యక్రమాలలో జనసేన అధినేత అస్సలు పాలు పంచుకోరనేది బహిరంగ విషయమే. అందులోనూ రైలు దహన ఘటనలో కేవలం కాపులు మాత్రమే భాగస్వామ్యులు కాలేదు. ఇతర ప్రదేశాల నుండి వచ్చి రైలును దహనం చేసారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.

వైసీపీకి అత్యంత అనుకూలంగా మారిన ఈ విషయంలో అసలు దోషులు ఎవరో తెలియకుండానే కేసులు ఎత్తేయడం వెనుక మతలబు ఏమిటి? వారంతా సొంత పార్టీకి చెందిన వారా? ఇలాంటి అనేకానేక ప్రశ్నలకు జవాబు దొరకకుండానే జగన్ చేసిన పనికి పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించాలని డిమాండ్ చేయడం ఏ మాత్రం సమంజసం కాదు.

ఒకవేళ కాపులే నిజంగా రైలు దహన కేసులో ఉన్నా, ఆ కేసులను పవన్ కళ్యాణ్ ఎత్తేయాలని డిమాండ్ చేయకపోవచ్చు. ఎందుకంటే చట్ట వ్యతిరేక పనులు చేస్తే సొంత పార్టీ వారైనా, సొంత కులానికి సంబంధించిన వారైనా పవన్ ఉపేక్షించరని, ఇటీవల సోషల్ మీడియా ఫణి విషయంలో జరిగిన సంఘటన చెప్పకనే చెప్పింది.

ప్రభుత్వ ఉద్యోగుల నిరసనను డైవర్ట్ చేయడానికో లేక సొంత పార్టీ వారిపై ఉన్న కేసులను ఎత్తివేయడానికో ప్రభుత్వం తీసుకున్న చర్యగా ఇది కనపడుతోంది తప్ప, ఇందులో ప్రజా సంక్షేమం ఎక్కడ కనపడుతుందో? అయినా కాపులపై కేసులకు, పవన్ కళ్యాణ్ కు సంబంధం ఏమిటి? బోడి గుండుకు – మోకాలుకు ముడిపెట్టడం తప్ప!