ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) చివరి దశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 14 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించారు. దానిలో ప్రజలు సమర్పించిన ఎన్యుమరేషన్ ఫారాలను పరిశీలించిన తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి శుక్రవారం విడుదల చేశారు.
దాని ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.71 కోట్లు. రాష్ట్రంలో సుమారు 15.22 లక్షల మంది మరణించినట్లు ఇంటింటి సర్వేలో గుర్తించారు. మరో 7.37 లక్షల మందికి రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నట్లు గుర్తించారు. అంటే మొత్తం 22.59 లక్షల ఓట్లు తొలగించబోతున్నట్లు భావించవచ్చు.
ఇటీవల చనిపోయినవారి ఓట్లు తొలగించడం మామూలే. కానీ ఎప్పుడో చనిపోయినవారి ఓట్లు కూడా నేటికీ వాడుకలో ఉన్నాయంటే అన్ని దొంగ ఓట్లు పడుతున్నాయన్న మాట. అదేవిధంగా రెండు చోట్ల ఓటు హక్కు కలిగినవారు బహుశః హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రావారివై ఉండవచ్చు. ఇదే నిజమనుకుంటే వారు ఎక్కడి ఓటు హక్కు వదులుకుంటారు లేదా కోల్పోతారనేది రెండు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలకు ఆందోళన కలిగించే విషయమే.
అయితే సర్ ప్రక్రియలో సర్వే మొక్కుబడిగా సాగిందే తప్ప వివిధ కారణాల వలన బీఎల్‌వోలు రాష్ట్రంలో ప్రతీ ఇంటికి వెళ్ళలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సర్ ప్రక్రియలో తమ ఓట్లు పోకుండా కాపాడుకోవాలని రాజకీయ పార్టీలు తమ నేతలకు, కార్యకర్తలకు గట్టిగా ఆదేశించినందున, బీఎల్‌వోలపై వారి ఒత్తిళ్ళు ఉండి ఉండవచ్చు. ఒకవేళ నిజంగా ఇంటింటికీ వెళ్ళి సర్వే చేసి ఉంటే మరిన్ని లక్షల దొంగ ఓట్లు బయటపడి ఉండేవనే వాదనలు వినిపిస్తున్నాయి.
ముసాయిదా జాబితాపై రాజకీయ పార్టీలు ఎటువంటి అభ్యంతరాలు తెలుపలేదంటే వాటి అసలు/నకిలీ ఓట్లని అవి కాపాడుకొని ఉండాలి. లేదా అత్యంత పారదర్శకంగా సర్ ప్రక్రియ కొనసాగి ఉండాలి. ఒకవేళ అభ్యంతరం తెలిపితే ఈ సర్ ప్రక్రియలో ఆ పార్టీ దొంగ ఓట్లు ఎగిరిపోయానని భావించవచ్చు.
ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలతో సర్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది కనుక దానిపై అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి తెలిపారు. ఆ జాబితా ఆధారంగా ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమవుతోంది.






