వైసీపి పాలనలో ఉపాధ్యాయులు జీతాల కోసం రోడ్లెక్కి ఆందోళనలు చేయడం చూశాము. అందుకు వారూ, ప్రజలు కూడా సిగ్గు పడుతున్నారు కానీ పాలకులకు సిగ్గనిపించడం లేదు. అందుకే నేటికీ వారి జీతాల చెల్లింపు ఆలస్యం అవుతూనే ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు కూడా గత 5 రోజులుగా తమ జీతాల కోసం రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు.
కరెంట్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు, ఇళ్ళ అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోతుంటే ఇంకా నామమాత్రపు జీతాలతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. సమాజంలో పిల్లలకు కడుపు నిండా తిండిపెట్టి లాలిస్తున్న తమ పిల్లలను చదివించుకోలేని దుస్థితిలో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల పెంపుతో సహా తమ సమస్యలని పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు.
“నా అక్కలు… నా చెల్లెమ్మలు… నా బీసీలు… నా ఎస్సీలు అంటూ దీర్గం తీస్తూ కమ్మగా కబుర్లు చెప్పే జగన్మోహన్ రెడ్డికి మేము అక్కచెల్లెమ్మల్లా కనబడటం లేదా?మా గోడు వినిపించడం లేదా?” అని వారు ప్రశ్నిస్తున్నారు.
వారేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని అర్దమవుతూనే ఉంది. కానీ వారిపట్ల సానుభూతితో స్పందించాల్సిన వైసీపి ప్రభుత్వం ‘సమ్మె చేస్తే ఉన్న ఆ ఉద్యోగాలు కూడా పీకేస్తామంటూ’ బెదిరించడం, అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొడుతుండటం వంటివి చేస్తూ వారి పట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తోంది. ఇది చూసి ప్రజలు, ప్రతిపక్షాలు కూడా వైసీపి ప్రభుత్వం తీరుని ఈసడించుకొంటున్నారు.
అంగవాడీ కార్యకర్తలను ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా పట్టించుకోవని, వారి కోసం పోరాడేందుకు ఎవరూ ముందుకు రారని కనుక రాజధాని రైతులతో ఆదుకొన్నట్లుగానే వారితోనూ ఆడుకోవవచ్చని వైసీపి ప్రభుత్వం భావిస్తున్నట్లుంది.
అయితే తమ వాలంటీర్లకు ఏవిదంగా ఆయా ప్రాంతాలలో ప్రజలతో బలమైన సంబంధాలు ఉంటాయో అదేవిదంగా అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ప్రజలతో ముఖ్యంగా సాటి మహిళలతో బలమైన సంబంధాలు ఉంటాయని, వారితో ఇదేవిదంగా ఆటలాడుకొంటే వారి పరిధిలో ఓట్లు పోగొట్టుకొంటామని వైసీపి ప్రభుత్వం ఇంకా గ్రహించినట్లు లేదు. ఇలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఒక్కో వర్గాన్ని వైసీపి దూరం చేసుకోవడం చూస్తే కేసీఆర్‌కు గుర్తుకు రాకమానరు.




