“బాహుబలి – ది కన్ క్లూజన్” సినిమాకు సంబంధించిన ఓ స్టిల్ లీక్ అయ్యి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అధికారికంగానే చిత్ర యూనిట్ పోస్టర్లను రిలీజ్ చేస్తున్న నేపధ్యంలో… ఈ స్టిల్ మాత్రం అఫీషియల్ కంటే ముందుగానే అనధికారికంగా వచ్చేసింది. ప్రభాస్, రానా, కట్టప్ప, తమన్నా, అనుష్కలు ఉన్న ఈ ఫోటోలో అనుష్క లుక్ మాత్రం చూపరులను అవాక్కయ్యేలా చేస్తోంది.
నెత్తి మీద ఓ చిన్న తపాలా లాంటిది పెట్టుకుని కనపడుతున్న అనుష్క లుక్ చూసి ‘అయ్యో అయ్యయ్యో’ అనడం నెటిజన్ల వంతవుతోంది. అంతకు ముందు బాణాలు విసురుతూ విడుదల చేసిన స్టిల్ లో చక్కగా స్లిమ్ గా కనిపించిన అనుష్కకు, తాజా ఫోటోలో కనపడుతున్న అనుష్కకు ఎక్కడా పోలిక లేకపోవడంతో ఈ ఫోటోలో ఎందరూ ఉన్నా అందరి చూపులు అనుష్క వైపుకే మళ్ళుతున్నాయి.
దీంతో భళ్ళాలదేవుడు ఎన్ని కష్టాలు పెట్టాడో అంటూ దేవసేనపై అభిమానం చూపించడం ఫ్యాన్స్ వంతవుతోంది. బహుశా మార్చి 16న విడుదల కాబోతున్న ట్రైలర్ లో దీనిపై ఏమైనా స్పష్టత వస్తుందేమో చూడాలి. తెలుగు సినీ పరిశ్రమ ఎన్నో బ్లాక్ బస్టర్లను చవిచూసిన ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా విడుదల కానుండడంతో… ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించడం ఖాయమన్న టాక్ హల్చల్ చేస్తోంది.



