గత కొన్ని రోజులుగా, నిశ్శబ్దం విడుదలకు అనుష్క అడ్డుపడుతున్నారని పుకార్లు వచ్చాయి. లొక్డౌన్ కారణంగా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి… ఓపెన్ అయ్యాకా కూడా మంచి రిలీజ్ డేట్ దొరుకుతుందా లేదా అనే అనుమానంతో చిత్ర నిర్మాతలు సినిమా హక్కులను విక్రయించడానికి OTT ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరుపుతున్నారని సమాచారం.
థియేటర్లకు బదులుగా డిజిటల్ స్పేస్ లో సినిమాను విడుదల చేయడానికి అనుష్కకు ఆసక్తి లేదని వార్తలు వచ్చాయి. దీనిపై మేకర్స్ వివరణ ఇచ్చారు. “షూట్ మొదలు పెట్టిన రోజు నుండి ఇప్పటి వరకు, మా తారలు మరియు సాంకేతిక నిపుణులు మంచి మరియు చెడు సమయాల్లో మాకు మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా అనుష్క శెట్టి కూడా ఎంతో మద్దతుగా నిలిచారు. దయచేసి మీరు చూసే నిరాధారమైన పుకార్లను నమ్మవద్దు ”అని మేకర్స్ స్పష్టం చేశారు.
ఈ థ్రిల్లర్ చిత్రం ఏప్రిల్ 2 న విడుదల కావాల్సి ఉంది కాని లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. నిశాబ్ధం సినిమాకు హేమంత్ మధుకర్ దర్సకత్వం వహించారు మరియు టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు. కోన వెంకట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అనుష్క ఈ సినిమాలో ఒక మూగ ఆర్టిస్టు సాక్షి గా కనిపిస్తుంది.
ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ మైఖెల్ మ్యాడసన్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. బాహుబలి లో దేవసేనగా అదరగొట్టిన అనుష్క ఆ తరువాత కేవలం ఒకే ఒక్క సినిమాలో భాగమతిగా కనిపించింది. దాంతో అనుష్క నటించిన ఈ చిత్రం ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.





