ఏపీ ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి ఎవరికీ అంతుపట్టని ఓ బ్రహ్మ పదార్ధంలా మారింది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏవిదంగా సాగుతోందో ఆర్ధిక రంగ నిపుణులు కూడా చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వం చేతిలో డబ్బు లేదా?అంటే పుష్కలంగా ఉంది… రెండున్నరల లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ చూడలేదా? అని ఆర్ధికమంత్రి రాజేంద్రనాధ్ బుగ్గన వేలేసుకొని అడుగుతుంటారు.
గత 58 నెలలుగా క్రమం తప్పకుండా జగన్ బటన్లు నొక్కుతూ ప్రజలకు ‘మేలు’ చేస్తూనే ఉన్నారు కదా? ప్రభుత్వం నిజంగా అంత దయనీయ పరిస్థితిలో ఉంటే, చేస్తున్న ‘మేలు’ గురించి వందల కోట్లు ఖర్చు చేసి పత్రికలలో, టీవీ ఛానల్స్‌లో ప్రకటనలు ఇచ్చుకోగలిగేదా?వందల కోట్లు ఖర్చు పెట్టి ‘సిద్దం’ ఫ్లెక్సీ బ్యానర్లు వేయించుకోగలిగేదా? వాలంటీర్లకు వందల కోట్లు నగదు బహుమతులు ఇవ్వగలిగేదా? అని ఎవరూ ఆలోచించడం లేదు.
సిఎం కోసం వందల కోట్లు అద్దె చెల్లించి రెండు హెలికాఫ్టర్లు సిద్దం చేసుకోగలదా?కొండంత ఋషికొండని పిండి పిండి చేసేసి దానిపై రూ.500 కోట్లతో విలాసవంతమైన భవనాలు నిర్మించగలిగేదా?అని గిట్టనివారు ఆలోచించలేకపోతున్నారు.
కానీ లోకులు కాకులు వంటివారు… కనుక రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, శ్రీలంకలా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాళా తీసే రోజు ఎంతో దూరంలో లేదని వాదిస్తుంటారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నెలనెలా సకాలంలో జీతాలు ఇవ్వలేదని పిచ్చి ప్రశ్నలు అడుగుతుంటారు.
పంచాయితీలకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటే ‘స్వాహా’ చేసిందంటారు. ఒకటేమిటి… రోడ్లు వేయలేదంటారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదంటారు. అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచడం లేదంటారు. ఇలా ఏదో ఓ సాకుతో ఆడిపోసుకొంటూ ‘మేలు చేసేవాడి’ మనసుని నొప్పిస్తూనే ఉంటారు. ఏం చేస్తాం? పండ్ల చెట్టుకే రాళ్ళ దెబ్బలు తప్పవని ఏలినవారు నిట్టూర్చి ‘మేలు’ చేసుకుపోతూనే ఉన్నారు.
ఇంత మేలు చూడలేని చంద్రబాబు నాయుడు వంటి గిట్టనివారు, ఋషికొండలో రహస్యంగా ప్రారంభోత్సవాలు చేస్తున్న సమయంలోనే ఇక్కడ అమరావతిలో సచివాలయాన్ని గుట్టుగా తాకట్టు పెట్టి రూ.370 కోట్లు అప్పు తెచ్చినందుకు మండి పడుతున్నారు.
“ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు కూర్చొనే పరిపాలనా భవనాన్నే తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవడం సిగ్గుచేటు… జగన్ తాకట్టు పెట్టింది భవనాలను కాదు… తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని…” అంటూ చంద్రబాబు నాయుడు ఆవేదన పడిపోతున్నారు తప్ప అసలు ఇలాంటి గొప్పగొప్ప ఐడియాలు ప్రపంచంలో మరెవరికీ రావని గుర్తించి గర్వపడలేకపోతున్నారు. ఇలాంటి గొప్ప గొప్ప ఐడియాలు మనకెందుకు రావని బాధపడరు!
సచివాలయం తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవడమే ప్రతిపక్షాలకు కనిపిస్తోంది తప్ప దాని వెనుక ఉన్న గొప్ప ‘వ్యూహం’ ఎవరూ చూడలేకపోతున్నారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికే అమరావతిలో ప్లాట్లు వేసి పేదలకు సెంటు భూములు పంచి పెట్టేసింది. మిగిలిన భూములలో అభివృద్ధి కోసం వేలంవేసి అమ్మేస్తున్నామని ఎప్పుడో చెప్పింది. అంతే కాదు… అమరావతిలో గత ప్రభుత్వం కట్టించిన భవనాలలో చాలా వాటిని లాంగ్ లీజుకి ఇచ్చేసిన్నట్లు వార్తలు వచ్చాయి.
వీటన్నిటినీ కలిపి చూస్తే ఒక విషయం అర్దమవుతుంది. కేసీఆర్‌లాగా ఏదో ఓ రోజూ మనం కూడా ఎలాగూ సచివాలయం ఖాళీ చేసి వెళ్ళిపోక తప్పదు. కాబట్టి ఒకవేళ టిడిపి, జనసేనలు అధికారంలోకి అమరావతిలో కూర్చోనేందుకు కుర్చీ కూడా లేకుండా చేయాలనే గొప్ప దూర దురాలోచన కనిపిస్తోంది.
ఇంత దూరదృష్టితో వినాశనం, విధ్వంసాన్ని ప్లాన్ చేయగడం మామూలు విషయం కాదు. అందుకే సచివాలయం తాకట్టు పెట్టడం వంటి చిత్రవిచిత్రమైన వార్తలు విన్నప్పుడల్లా తెల్లమొహాలు వేసుకొని చూస్తుండిపోతారు. అందుకు వారి మీదే జాలి పడాలి.
రాష్ట్రానికి ఎంత అవమానకరం…ఎంత బాధాకరం…ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ… pic.twitter.com/tUNaoecZKR
— N Chandrababu Naidu (@ncbn) March 3, 2024




