టీడీపి, జనసేన: పంచాయతీ లెక్కలు వేరే!

TDP Jana Sena AP Panchayat election plans

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి భిన్నమైన వ్యూహాలతో ముందుకు సాగుతుండటం ఆసక్తి కలిగిస్తుంది.

పార్టీలు, జండాలు రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ పంచాయతీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వం తరపున భారీ పారితోషికాలు ప్రకటించారు.

ADVERTISEMENT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ శ్రేణులకు ఈ ఎన్నికలలో స్వేచ్ఛగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా పోటీ చేయవచ్చని పవన్ కళ్యాణ్‌ సంతకంతో జనసేన సోషల్ మీడియాలో అదివారం ఓ లేఖ విడుదల చేసింది.

ఈ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఉండవు కనుక పార్టీలో ఆసక్తి గలవారు ఎవరైనా పోటీ చేయవచ్చని దానిలో పేర్కొన్నారు. వారికి జనసేన నాయకులు సాయపడాలే తప్ప అవరోధాలు సృష్టించరాదని చాలా స్పష్టంగా ఆ లేఖలో పేర్కొన్నారు.

అంతే కాదు.. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న జనసేన అభ్యర్థులకు సహాయం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు కూడా ఏర్పాటు చేస్తోంది.

కనుక పవన్ కళ్యాణ్‌ ఈ ఎన్నికలతో జనసేన పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే టీడీపి, బిజేపి, వైసీపీ అనుకూల వర్గాలతో పోటీ పడాల్సి ఉంటుంది. వద్దనుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఏకగ్రీవాలు ఉండనే ఉన్నాయి.

సీఎం చంద్రబాబు నాయుడు ఈసారి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు చాలా భారీగా పెంచారు. జనాభాను బట్టి రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అందించాలని నిర్ణయించారు.

గ్రామంలో సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైతేనే ఈ నిధులు అందుతాయి. గ్రామాల మధ్య ఐక్యత పెరగడంతో పాటు, ఎన్నికల ఖర్చు, రాజకీయ ఘర్షణలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే ఇది కేవలం టీడీపి అనుకూల వర్గాలకు మాత్రమే కాదు… వైసీపీతో సహా జనసేన, బిజేపి అనుకూల వర్గాలు కూడా ఏకగ్రీవాలు చేసుకోగలిగితే ఈ ప్రోత్సాహకాలతో లబ్ది పొందవచ్చు. కనుక ఈ ఈ ఏకగ్రీవాలు, జనసైనికులకు స్వేచ్చగా పోటీ చేసే అవకాశం కల్పించడం రెండూ ఈ ఎన్నికల్లో ‘గేమ్‌ చేంజర్స్’ అని చెప్పవచ్చు. మరి వీటితో గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌పై ఏ పార్టీ పట్టు సాధిస్తుందనేది ఆసక్తికరం.

ADVERTISEMENT
Latest Stories