సినీ ‘మా’ సమస్య కాదా.?

Are Cinema Problems Not MAA Problems?

రాజకీయ కురుక్షేత్రాన్ని తలతన్నేలా, రాజకీయ నాయకుల విమర్శలకు ఏమాత్రం తీసిపోనిలా ‘మా’ అధ్యక్ష ఎన్నికల సమరాలు జరిగాయి. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలు అని చెప్పుకునే కుటుంబాలు సైతం మా ఎన్నికల సమరంలో హోరాహోరీ కుస్తీపట్లు పట్టుకున్నాయి.

హద్దులు దాటి ఒకరి వర్గం పై మరొక వర్గం విమర్శలు చేసుకోవడం, ఒకరిని మరొకరు కించపరిచేలా వ్యాఖ్యానించడం, చివరికి మా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇండస్ట్రీ సభ్యుల మధ్యే దాడులు జరిగిన సంఘటనలు, వాటి నియంత్రణకు అడ్డుకట్టవేయాల్సిన వారు సైతం హద్దులు దాటినా వైనాలు ఇలా ఎన్నో ఘటనలు టాలీవుడ్ గౌరవాన్ని మసక మార్చాయి.

ADVERTISEMENT

అయితే ఇదంతా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగు కోసమే, ఆ పరిశ్రమ అభివృద్ధి కోసమే, మా భవన నిర్మాణం కోసమే అంటూ నాడు ప్రగల్బాహాలు పలికిన మా సభ్యులు నేడు ఇండస్ట్రీ ఎదుర్కుంటున్న ఏ ఒక్క సమస్య పై అయినా ఏనాడైనా గళం విప్పారా.?

అలాగే అటు ప్రభుత్వాల నుంచి ఇండస్ట్రీ పై వస్తున్న ప్రశ్నలకు బదులు చెప్పారా.? నిర్మాతల నుండి డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, చివరికి నటీనటులు ఎదుర్కుంటున్న అనేక సమస్యలు టాలీవుడ్ ను చుట్టు ముట్టినా ‘మా’ మాత్రం మాకు సంబంధం లేదుగా అన్నట్టుగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం.?

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల రేట్లు తగ్గించినా, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సినిమాల బెనిఫిట్ షో ల మీద నియంత్రణ వేసినా, చివరికి ఏపీ డిప్యూటీ సీఎం పేషీ నుంచి ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ప్రకటన వచ్చినా మా అధ్యక్ష పదవిలో ఉన్న వారు కనీసం ఎందుకు స్పందించడం లేదు.

సినీ ‘మా’ సమస్యలు ‘మా’ కు పట్టవా.? టాలీవుడ్ నుంచి ప్రభుత్వంతో చర్చలు జరపాలన్నా, టాలీవుడ్ నుంచి ప్రభుత్వానికి సూచనలు, అభ్యర్ధనలు విన్నవించాలన్న ‘మా’ కు సంబంధం లేదా.? ఆ అధ్యక్ష పదవికి ఆ అర్హత లేదా.?

నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రీ పై ప్రభుత్వ పెత్తనాన్ని ప్రశ్నించలేని మా, నేటి ప్రభుత్వ నిర్ణయాలను నిలదీయగలదా.? నాడు గెలుపు కోసం సొంత ఇండస్ట్రీ వారి పై మాటలతోనే కత్తులు దూసిన వారు నేడు అదే ఇండస్ట్రీ బాగు కోసం గొంతు ఎత్తలేకపోతున్నారా.? అనేది సామాన్య సినీ ప్రేక్షకుడి నుంచి ‘మా’ కు ఎదురవుతున్న ప్రశ్నలు.

థియేటర్ల బంద్ నుంచి సినిమా టికెట్ల పెంపు వరకు, గద్దర్ అవార్డుల నుంచి నంది అవార్డుల వరకు, ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం వరకు, పైరసి నుంచి ఓటిటి రిలీజ్ వరకు ఇలా ఇండస్ట్రీ ముందు ఎన్నో అంతు చిక్కని సమస్యలు, కానీ వాటి పరిష్కారానికి మా చేసిన ప్రయత్నాలు.?

ADVERTISEMENT
Latest Stories