ఈ విషయంలో జగన్, కేసీఆర్‌ దొందూ దొందేనా?

KCR Jagan

వైసీపి, బిఆర్ఎస్ పార్టీల అధినేతలు జగన్, కేసీఆర్‌ల మద్య కొన్ని విషయాలలో చాలా భిన్నంగా, కొన్నిటిలో ఇంచుమించు ఒకేలా వ్యవహరిస్తుంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరినీ కలుపుకుపోతూ పోరాటాలు చేసి లక్ష్యం సాధించారు. కానీ అదే కేసీఆర్‌… ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రాజకీయ అపరిచితుడులా మారిపోయారు.

తనతో భుజం భుజం కలిపి పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్‌ వంటి ఉద్యమకారులను వదిలించేసుకొని తన పదవీ, అధికారం, ప్రభుత్వానికి ఉపయోగపడే తలసాని, ఎర్రబెల్లి వంటివారిని చంకనెక్కించుకున్నారు. పదేళ్ళ పాలనలో తెలంగాణలోని మేధావులను, విద్యావేత్తలను, మీడియాని, రాష్ట్రంలో వివిద వర్గాల ప్రజలను దూరం చేసుకున్నారు.

ADVERTISEMENT

ప్రధాని నరేంద్రమోడీ మొదలు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ వరకు, చివరికి త్రిదండి చిన్న జీయర్ స్వామి వంటి వారిని కూడా శత్రువులుగా మార్చేసుకున్నారు. దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులతో దోస్తీకి ప్రయత్నించి తన రాజకీయ ఆలోచనలు, అహంభావం వలన అందరినీ దూరం చేసుకొని దేశ రాజకీయాలలో ఏకాకిగా మిగిలిపోయారు.

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు నుంచే శత్రువులను పెంచుకుంటూ, 5 ఏళ్ళ పదవీకాలం ముగిసేసరికి రాష్ట్రంలో ప్రతిపక్షాలను మాత్రమే కాక అనేక వర్గాలను, సామాన్య ప్రజలను కూడా శత్రువులుగా మార్చుకున్నారు. రాజధాని రైతులే ఇందుకు ఓ చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

కేసీఆర్‌ తన ప్రత్యర్ధులను రాజకీయంగా దెబ్బతీసి బలహీనపరిచేవారు. కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను బిఆర్ఎస్ పార్టీలోకి తీసుకుని ఆ రెండు పార్టీలను దెబ్బ తీశారు. కానీ జగన్‌ మరో అడుగు ముందుకు వేసి, చంద్రబాబు నాయుడుతో సహా టిడిపి ముఖ్యనేతలందరిపై కేసులు నమోదు చేయించి అందరినీ జైల్లో పెట్టించి రాజకీయంగా తమకు ఎదురులేకుండా చేసుకోవాలనుకున్నారు.

ఆ క్రమంలో చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టించారు కానీ దాని వలననే ఎదురుదెబ్బ తిన్నారు. ఇప్పుడు ఎన్నికలలో కూడా దానికి మూల్యం చెల్లించబోతున్నారు.

కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులకు, మేనల్లుడు హరీష్ రావు, సంతోష్ కుమార్‌ తదితర బంధువులకు చాలా ప్రాధాన్యత ఇస్తూ, వారికి తన ప్రభుత్వంలో, పార్టీలో అందరూ కూడా చాలా గౌరవించేలా చేయగలిగారు. అలాగే ప్రజలలో కూడా వారి ప్రాధాన్యత పెరిగేలా చేసుకున్నారు. కనుక ఈ కష్టకాలంలో ఆయనకు వారందరూ అండగా నిలబడుతున్నారు.

శత్రువులను తయారు చేసుకోవడంలో కేసీఆర్‌తో పోటీ పడిన జగన్‌, మరో అడుగు ముందుకు వేసి తన తల్లిని, చెల్లిని, బాబాయ్ వివేకా ఫ్యామిలీని అందరినీ కూడా శత్రువులుగా మార్చుకున్నారు. కనుక ఈ ఎన్నికలలో వారే ఆయనను నిలదీసి ప్రశ్నించారు.

అయితే అవినాష్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి వంటివారిని చేజార్చుకోకుండా జాగ్రత్తపడ్డారు. కానీ ఈ ఎన్నికలలో వైసీపిని మళ్ళీ గెలిపించుకునేందుకు వారు ఆయనకు పెద్దగా తోడ్పడలేకపోయారు. అందుకే జగన్‌ తాను ఒంటరినని, ఒంటరి పోరాటం చేస్తున్నానని పదేపదే చెప్పుకునేవారు కూడా.

ప్రధాని నరేంద్రమోడీ విషయంలో కేసీఆర్‌ మళ్ళీ ‘మోడీ, గీడీ…’ అంటూ రెచ్చిపోతున్నారు కనుక లోక్‌సభ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీకి మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు. కానీ ఈ విషయంలో మాత్రం జగన్మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌లాగ రెచ్చిపోకుండా నేటికీ మోడీకి విధేయంగానే మెసులుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏర్పాటు, అభివృద్ధి విషయంలో జగన్మోహన్‌ రెడ్డి ఏమాత్రం దూరదృష్టి చూపకపోయినా, మోడీ పట్ల విధేయంగా ఉంటూ తన సొంత విషయంలో చాలా దూరదృష్టితో వ్యవహరించారు. కనుక ఈ ఎన్నికలలో వైసీపి ఓడిపోయి, జగన్‌ అధికారం కోల్పోయినా ఆయనకు ప్రధాని మోడీ సహాయం, రక్షణ తప్పక లభించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories