ఉమ్మడి కుటుంబాలు అంతరించి పోతున్న సంపదలా.?

Are Joint Families Fading Away in Modern Times?

ఒకప్పుడు నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, పెదనాన్న, పెద్దమ్మ, బాబాయ్, పిన్ని, అత్తా, మామా, అన్న , అక్క, తమ్ముడు, చెల్లి…అంటూ ఇలా అనేకరకాల రక్త సంబంధాలన్నీ కూడా ఒకే చూరి కింద కనిపించేవి, ఆప్యాయంగా పలకరించేవి. అయితే ఇప్పుడు ఆ బంధాల్ని ఎదో ఒక శుభకార్యంలో మాత్రమే వినిపిస్తున్నాయి.

అయితే వీటికి కారణాలు అన్వేషిస్తే టన్నులలోనే దొరుకుతాయి. ఒకప్పుడు బంధాలు విశాలంగా, ఇల్లు ఇరుకుగా ఉంటే నేటి తరంలో గదులు విశాలంగా, బంధాలు బలహీనంగా ఉంటున్నాయి. అలాగే నాటి కాలంలో అందరు కలిసి ఒకదగ్గర కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా సమయాన్ని గడిపిన కుటుంబాలను చూస్తే, ఇప్పుడు కనీసం భార్య భర్త కలిసి కూర్చొని కూడా భోజనం చెయ్యలేని కుటుంబాలను చూస్తున్నాం.

ADVERTISEMENT

ఒక పిల్లల సంగతి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనే చెప్పాలి. నాటి తరంలో నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు చెప్పే చందమామ కథల స్థానంలో నేడు యూట్యూబ్ స్టోరీస్, చిట్టి చిలకమ్మల పద్యాల సమయంలో ఇంస్టాగ్రామ్ రీల్స్, రాముని వీర గాధలు, కృష్ణుని ధర్మ మాయలు అంటూ చెప్పే నీతి కథల స్థానంలో ట్విట్టర్ గాసిప్స్ లు వచ్చి చేరాయి.

ఒకప్పుడు తన సొంత తోబుట్టువులతో, ఇరుగు పొరుగు స్నేహితులతో వీధులలో సరదాగా ఆడుకునే ఆటలు నేడు ఒంటరిగా ఎవరో తెలియని వ్యక్తుల మధ్య ఏసీ గదులలో ఆన్ లైన్ గేమ్స్ రూపంలో ఆడుతున్నారు చిన్నారులు. క్లుప్తంగా ఒక్కమాటలో చెప్పాలంటే నేటితరం బాల్యం మొత్తం వారి చేతిలో ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మధ్యనే ముగిసిపోతుంది.

ఈ దుస్థితికి కారణం ఎవరు.? ఎందుకు.? పుట్టుకొస్తున్న వింత పోకడలే ఉమ్మడి కుటుంబాలను అంతరింపచేస్తున్నాయా.? క్షిణిస్తున్న మానవ సంబంధాలు, మనిషిలో పెరుగుతున్న నా అనే స్వార్ధం ఉమ్మడి కుటుంబాలను ఒక చరిత్రగా మార్చేస్తున్నాయా.? లేక విద్య, ఉపాధి అంటూ పిల్లలకు – తల్లితండ్రులకు మధ్య ఏర్పడుతున్న ఈ దూరాలే ఉమ్మడి కుటుంభాలను విచ్ఛిన్నం చేస్తున్నాయా.?

లేక అమ్మ – నాన్నల పై ఉండే ఆదరణ, అత్తా – మామల మీద పై కనిపించడం లేదా.? పుట్టింటి వారి పై చూపే ప్రేమ అత్తంటి వారి పై లేకపోవడమేనా.? ఇందులో స్త్రీ, పురుష అనే లింగ బేధాలు లేవు. ఇక ఉరుకుల పరుగుల జీవితాలలో వ్యక్తిగత అవసరాలకే సమయం కేటాయించలేని నిస్సహాయత ఈ ఉమ్మడి కుటుంబాల ఆస్తిని అంతరించేలా చేస్తుందా.?

ఇందులో ఎవరిని నిందించలేము, ఎవరిని తప్పుబట్టలేము. కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను తప్ప వేరొకరిని దోషిగా చిత్రీకరించలేము. నేటి తరం ఈ పోటీ ప్రపంచంలో రెప్పపాటు ఆలస్యం కూడా భారీ మూల్యాన్ని చెల్లిస్తుంది. అలాగే క్షణ కాలం ఏమరుపాటు సైతం సరిదిద్దుకోలేని తప్పులుగా మిగిలిపోతున్నాయి.

చివరిగా ఒక్క మాట…పిల్లలకు తాతయ్యలు, నాయనమ్మల సంరక్షణ అవసరమైన స్థానంలో ఇపుడు వాటి కోసం ‘డే కేర్లు’ వెలుస్తున్నాయి, అలాగే ఇటు తల్లితండ్రులకు పిల్లల చేయూత అక్కరకు రావాల్సిన సందర్భాలలో ‘వృద్దాశ్రమాలు’ పుట్టుకొస్తున్నాయి.

ఇవి ఎంతలా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి అంటే నాడు కుటుంసభ్యుల బాధ్యత గా ఉండే ఈ అవసరాల్ని నేడు ఒక కార్పొరేట్ వ్యాపారంగా ఎదిగిపోతున్నాయి. దీని బట్టి చూస్తే ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు వారసత్వపు ఆస్తి మాదిరి కొనసాగేవి కానీ ఇప్పుడు అంతరించి పోతున్న సంపద మాదిరి తరుగుతున్నాయి.

ఇప్పటివరకు ఇది మన ఇంటి పక్కనో, మన కాలనీలోనే, మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలలోనే కనిపించే ఈ సమస్య కావచ్చు కానీ రేపటి రోజున ఈ సమస్య మన ఇంటి తలుపు తడుతుంది. అందుకు అందరు అర్హులే అన్నట్టుగా సమాజ వైఖరి మారిపోయింది. అందుకు అందరు సిద్దమవ్వడమే తప్ప మరోదారి లేదు.

ADVERTISEMENT
Latest Stories