తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, యువతను ఊర్రూతలూగిస్తున్న “అర్జున్ రెడ్డి” సినిమాకు ప్రధాన హైలైట్ విజయ్ దేవరకొండ. అప్ కమింగ్ నటులలో ప్రామిసింగ్ యాక్టర్ గా కనపడుతున్న విజయ్, సిల్వర్ స్క్రీన్ పై ఇచ్చిన ప్రదర్శనకు సినీ విమర్శకులు కూడా మంత్రముగ్దులవుతున్నారు. “అర్జున్ రెడ్డి” సినిమా ప్రధాన హైలైట్స్ లో ఎవరైనా సరే ముందుగా చెప్పే అంశం విజయ్ దేవరకొండ పేరు మాత్రమే అన్నంతగా ఈ పాత్రకు ప్రాణం పోసాడు. ఒకవేళ విజయ్ కాకపోతే, ఈ పాత్రకు ఎవరు సూట్ అవుతారు? అప్ కమింగ్ నటులను పక్కనపెట్టి, స్టార్ హీరోలలో అయితే ఎవరు సరిగ్గా న్యాయం చేస్తారు?
సాధారణ ప్రేక్షకులకు ఈ ప్రశ్నకు జవాబు కాస్త కష్టమేమో గానీ, ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి మదిలో మాత్రం ఓ స్టార్ హీరో ఉన్నాడు. అతనే మెగా కాంపౌండ్ నుండి వచ్చిన అల్లు అర్జున్. ఓ మీడియా ఛానల్ అడిగిన ప్రశ్నలో భాగంగా… స్టార్ హీరోలలో అయితే అల్లు అర్జున్ ఈ పాత్రకు న్యాయం చేయగలరని తాను భావిస్తున్నానని, అయితే ఆయనను కలిసి ఈ కధ చెప్పే అవకాశం తనకు రాలేదని అన్నారు. కానీ, గతంలో ఓ ఆరేళ్ళ క్రితం బన్నీకి ఓ స్టోరీ చెప్పానని, ఆ సినిమాను మొదలుపెట్టలేకపోయానని, అప్పుడు తాను చూసిన బన్నీకి, ప్రస్తుతం ఉన్న స్టేటస్ కు ఎక్కడ పొంతన లేదని అన్నారు.
సందీప్ రెడ్డి చెప్పినట్లుగా ఈ కధను స్టార్ హీరోతో తెరకెక్కిస్తే… హీరోకు పేరు వచ్చేదేమో గానీ, సినిమా ఈ స్థాయిలో వచ్చేది కాదని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే… స్టార్ హీరో అంటే ఉండే లిమిటేషన్స్ తెలియనివి కావు. అలాంటి సీన్లు చేయకూడదు… ఇలాంటి డైలాగ్స్ చెప్పకూడదు… అంటూ స్టార్ హీరోలకు ఓ బోర్డర్ ఉంటుంది. “అర్జున్ రెడ్డి” సినిమాలో ఆ బోర్డర్ దాటినట్లు స్పష్టంగా కనపడుతోంది. దీంతో మొత్తం కధకే ఎసరు వచ్చేదని చెప్పవచ్చు. అయితే మొదటి సినిమా కాకపోయినా, తన తదుపరి సినిమా స్టార్ హీరోతోనే ఉండవచ్చని “అర్జున్ రెడ్డి” సందీప్ రెడ్డి ఇటీవల స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే.


