మరో తొమ్మిది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “బ్రహ్మోత్సవం” సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు ఎలాంటి పాత్ర పోషించాడు? ఆడియో వేడుకపై రిలీజ్ చేసిన ట్రైలర్ లో ప్రిన్స్ పాత్ర పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేవలం కుటుంబ విలువలకు సంబంధించిన డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రిన్స్ పాత్రపై అభిమానుల ఆసక్తి నెలకొనగా, తాజాగా ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు పాత్ర గురించి సమాచారం ఇచ్చారు.
“ఈ సినిమా కోసం ఏకంగా 15 సెట్స్ వేశామని, అన్ని కూడా రామోజీ ఫిలిం సిటీలోనే రూపొందించామని, కధానాయకుడికి రంగులు తయారు చేసే పరిశ్రమ ఉందన్న అంశాన్ని కూడా పరిగణనలోనికి తీసుకుని, ఇంట్లో అక్కడక్కడ రంగుల ప్యాలెట్ లు పెట్టామని” తోట తరణి చిత్ర విశేషాలను తెలిపారు. వేసిన 15 సెట్లు వేటికవే విభిన్నంగా ఉంటాయన్న ఈ కళామ్మ తల్లి పుత్రుడు, మహేష్ ఇంటి సెట్, టెర్రస్ అద్భుతంగా వచ్చాయని అన్నారు.
విజయవాడ దుర్గ గుడి, తిరుపతి దేవాలయం, వారణాసి నేపధ్యంలో సాగే కొన్ని సన్నివేశాల కోసం కూడా ప్రత్యేకంగా సెట్స్ వేశామని, అయితే అవి వెండితెరపై వీక్షించేటపుడు ఆయా ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపినట్లే ఉంటాయని, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే రూపకల్పన చేసిన ఈ సెట్స్ కు పని చేసినందుకు గానూ తనకు పూర్తి సంతృప్తి కలిగిందని… తోట తరణి తన అనుభూతులను పంచుకున్నారు.



