‘రాజకీయాల్లోకి వచ్చి చాలా ఏళ్లయినా ఇంకా పరిణతి చెందలేదు… ఇంకా చిన్నపిల్లాడిలానే మాట్లాడుతున్నాడు… అంశాలపై సరైన అవగాహన లేదు’ అని ఇప్పటివరకూ చాలామంది కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శించారు. కొన్ని రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఆయనలో నూతనోత్తేజం కనిపించిందని, మాట తీరు మారిందని ఇటీవల విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పటికీ రాహుల్ గాంధీకి పలు అంశాలపై పూర్తిస్థాయి అవగాహన రాలేదని విమర్శించే వారి జాబితాలో కేజ్రీవాల్ కూడా చేరిపోయారు. అంతేకాదు ‘రాహుల్ ఓ బచ్చా’ అంటూ ఎద్దేవా చేశారు.
ఢిల్లీలోని షాకూర్ బస్తీలో మురికివాడల్లోని అక్రమ గుడిసెల తొలగింపు వ్యవహారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. బాధితులను పరామర్శించేందుకు సోమవారం రాహుల్ గాంధీ షాకూర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుడిసెల తొలగింపు వల్ల బాధితులకు జరిగిన నష్టానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించాలంటూ ఆప్, ఎన్డీయే ప్రభుత్వాలను విమర్శించారు. మరోవైపు షాకూర్ బస్తీ ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించాలంటూ ఆప్ ఆందోళన చేయడాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్.. ధర్నాచేయడం, ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ తమ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. పనిలో పనిగా తన ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీపై వ్యంగ్య బాణాలు సంధించారు. రాహుల్ ఇంకా ‘బచ్చా’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాహుల్ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేశాఖ తమ పరిధిలోకి రాదనే చిన్న విషయం కూడా తెలికయపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రైల్వే శాఖ కేంద్రం ఆధీనంలో ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండదనే విషయాన్ని పాపం కాంగ్రెస్ పార్టీ అతనికి చెప్పినట్టు లేదంటూ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. రాహుల్‌కు ఈ చిన్నపాటి విషయం కూడా తెలియదా అని ప్రశ్నించారు.





