తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో చావుదెబ్బ తిన్న శ్రీలంకను, తాజాగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు కోలుకోలేని విధంగా చేసింది. గ్రూప్ బిలో భాగంగా సోమవారం నాడు జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆఫ్ఘన్ చేతిలో ఓటమి పాలై అనూహ్యంగా టోర్నీ నుండి నిష్క్రమించింది శ్రీలంక. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ నిర్ణీత 50 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌట్ కాగా, గౌరవప్రదమైన లక్ష్య చేధనలో లంకేయులు దారుణంగా విఫలమయ్యారు.
[m9ad]
తొలి ఓవర్ నుండే ప్రారంభమైన లంక పతనం 158 పరుగులు చేరేపాటికి మొత్తం చాపచుట్టేసారు. ఏ దశలోనూ శ్రీలంక లక్ష్యం దిశగా సాగకపోవడం విశేషం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాలలో సమిష్టికృషి ప్రదర్శించిన ఆఫ్ఘన్ ను విజయం వరించడం సమంజసమే అయినా, పసికూనల చేతిలో పరాజయం పాలు కావడం మాత్రం అంచనాలకు మించిన ట్విస్ట్ గా మారింది. ముఖ్యంగా వచ్చే ఏడాది వరల్డ్ కప్ ఉన్న నేపధ్యంలో… నానాటికి లంక ప్రదర్శన అభిమానులకు ఆందోళన కలిగిస్తోన్న అంశం.





