జూనియర్ ఎన్టీఆర్… ఆడు సామి ఆడు…!

Jr NTR Bigg Boss‘బిగ్ బాస్’ షోను జూనియర్ ఎన్టీఆర్ ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చూసి ప్రేక్షకులే నివ్వెరపోతున్నారు. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ ద్వారా ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్స్ ను మాత్రమే చూసిన ప్రేక్షకులు, బుల్లితెరపై ప్రదర్శితం అవుతోన్న ‘బిగ్ బాస్’ షో ద్వారా తారక్ లోని ‘హ్యుమర్’ యాంగిల్ ను చూసి అవాక్కవుతున్నారు. దీంతో తమకు తెలిసిన యాంగ్రీ యంగ్ టైగర్ అసలు కాదని, ‘బిగ్ బాస్’ షోలో కనపడుతున్న తారకే అసలు ‘యంగ్ టైగర్’ అని కితాబిస్తున్నారు.

ADVERTISEMENT

ఈ షో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువవుతున్నారని చెప్పవచ్చు. ఇది రేపు సిల్వర్ స్క్రీన్ కెరీర్ కు కూడా చాలా ప్లస్ అవుతుందన్న విషయం రాబోయే సినిమాల ఓపెనింగ్సే చెప్తాయి. వీక్ డేస్ లో ‘బిగ్ బాస్’ షోను చూసినా, లేకున్నా, వీకెండ్స్ లో వచ్చే తారక్ షో కోసం ఎదురుచూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలా తన కోసం నిరీక్షించిన ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో, నూటికి రెండు వందల శాతం సక్సెస్ అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

తాజాగా జరిగిన ఎపిసోడ్ లో నవదీప్ ను ఆడుకున్న విధానం ప్రేక్షకులను అబ్బూరపరిచింది. వైల్డ్ కార్డు ఎంట్రీగా హౌస్ లోకి అడుగుపెట్టిన నవదీప్ ఇటీవల డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ‘మీ ఇంట్లో 500, 1000 పాత నోట్లు దొరికాయట… నిన్ను విచారణకు రమ్మంటున్నారు… నీకు అయిదు నిముషాల సమయం ఇస్తున్నాను…’ అని చెప్పడంతో నవదీప్ అవాక్కయ్యాడు. ‘కొత్త వెయ్యి రూపాయల నోట్లు వచ్చాయని నువ్వు అందర్నీ ఆటపట్టించినట్లే మేము నిన్ను’ అంటూ తారక్ చల్లగా చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు నవదీప్.

ఇంత ఎనర్జీ జూనియర్ ఎన్టీఆర్ లో ఉందని నిజంగా దర్శకనిర్మాతలకు కూడా తెలుసో లేదో గానీ ‘బిగ్ బాస్’ షో అనేది జూనియర్ ఎన్టీఆర్ కు టర్నింగ్ పాయింట్ గా కనపడుతోంది. బహుశా మున్ముందు జూనియర్ ఎన్టీఆర్ లోని మరిన్ని కొత్త యాంగిల్స్ ను సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయడానికి, దర్శకులకు తారక్ సరైన అవకాశాలను ఈ షో ద్వారా కల్పించినట్లయ్యింది. తారక్ ను చూస్తూ సాధారణ ప్రేక్షకులే ముగ్దులవుతుంటే… ఇక యంగ్ టైగర్ అభిమానుల ఆనందానికి అవధులు ఉంటాయా..! తట్టుకోవడం కాస్త కష్టమే…!

ADVERTISEMENT
Latest Stories