క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టు గురించి తెలిస్తే… ఆటోమాటిక్ గా ‘స్లెడ్జింగ్’ అనే పదంకు అర్ధం తెలిసిపోతుంది. అంతలా ‘స్లెడ్జింగ్’కు కంగారుల టీంకు అవినాభావ సంబంధం పెనవేసుకుపోయింది. ఒకప్పుడైతే ఈ ‘స్లెడ్జింగ్’తోనే ప్రత్యర్ధి టీంను రెచ్చగొట్టి, తద్వారా తమ జట్టు విజయానికి బాటలు వేసుకునేవారు. అయితే ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న సిరీస్ లో ఆసీస్ మునుపటి రేంజ్ లో కాకపోయినా, ఎంతో కొంత ‘స్లెడ్జింగ్’కు పాల్పడుతోంది.
మూడవ రోజు రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్ అభినవ్ ముకుంద్ ను బాల్ సరిగా చూడాలంటూ బౌలర్ స్టార్క్ ఓ సైగ చేసాడు. స్టార్క్ వేసిన బంతిని ముకుంద్ పుల్ చేయబోగా, అది ఎడ్జ్ తీసుకుని సిక్సర్ గా వెళ్ళిన తర్వాత స్టార్క్ ఈ విధంగా సైగ చేసాడు. అయితే దీనికి నాలుగవ రోజున అశ్విన్ రివేంజ్ తీర్చుకున్నాడు. అశ్విన్ వేసిన ఓ బంతిని ఆడబోయి బౌల్డ్ అయిన స్టార్క్ అదే విధంగా సైగ చేసి చూపించడంతో, స్టార్క్ అవాక్కయ్యాడు. దీంతో మైదానంలో ఉన్న ప్రేక్షకులు కూడా అదే విధంగా సైగలు చేసి స్టార్క్ కు సరైన రీతిలో బదులిచ్చారు.
ఇదిలా ఉంటే ఆసీస్ సారధిగా విధులు నిర్వహిస్తున్న కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి కంగారుల బుద్ధి చూపించారు. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయిన స్మిత్, రివ్యూ కోసమని మరో ఎండ్ లో ఉన్న హ్యాండ్స్ కాంబ్ సలహా కోరగా, అతను పెవిలియన్ ఎండ్ లో ఉన్న ఆసీస్ జట్టు వైపుకు చూపించడంతో, స్టీవ్ స్మిత్ కూడా ఏం చేయమంటారని కోరాడు. ఇది గమనించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఎంపైర్లను ప్రశ్నించే లోపుగా, ఎంపైర్లే స్మిత్ కు బుద్ధి చెప్పేలా నడిచి వస్తుండడంతో, చేసేదేమీ లేక పెవిలియన్ కు చేరుకున్నాడు స్మిత్.



