సొంతగడ్డపై ఆస్ట్రేలియా జట్టుకు రెండవ సారి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. టెస్ట్ సిరీస్ ను 4-0 తేడాతో కోల్పోయిన ఇంగ్లాండ్, వన్డే సిరీస్ లో మాత్రం అంచనాలకు మించి రాణిస్తోంది. మొదటి వన్డేలో భారీ స్కోర్ ను చేదించి, ఆసీస్ ను భంగపరిచిన ఇంగ్లాండ్, రెండవ వన్డేలోనూ 271 పరుగులను అవలీలగా చేధించి, అయిదు వన్డేల సిరీస్ లో 2-0తో ముందంజలో ఉంది. తదుపరి మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ వశమైతే, సిరీస్ ఇంగ్లాండ్ వశమైనట్లే. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడం సామాన్యమైన విషయం కాదన్నది క్రికెట్ ప్రేమికులకు తెలిసిందే.
ఆస్ట్రేలియా పరిస్థితి ఇలా ఉంటే, మరో పక్కన శ్రీలంక జట్టు అత్యంత దయనీయమైన స్థితిలో క్రికెట్ ఆడుతోంది. బంగ్లాదేశ్ – శ్రీలంక – జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న ట్రై నేషన్ సిరీస్ లో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడిన శ్రీలంక రెండింటిలోనూ పరాజయం పాలైంది. మొదటి వన్డేలో జింబాబ్వే చేతిలో చావుదెబ్బ తిన్న శ్రీలంకను కోలుకోనివ్వకుండా చేయడంలో బంగ్లాదేశ్ నేడు విజయవంతమైంది. 321 పరుగుల భారీ స్కోర్ ను చేధించలేక కేవలం 157 పరుగులకే లంకేయులు కుప్పకూలారు.
ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు ఏ స్థితిలో ఉందో ఈ రెండు ఓటములు చెప్పకనే చెప్తున్నాయి. బంగ్లాదేశ్ అంటే టాప్ టీంలను కూడా ఓడించిన ఘనత ఉంది గానీ, చివరికి జింబాబ్వే చేతిలో కూడా ఓటమి పాలు కావడంతో, ఫైనల్స్ కు శ్రీలంక జట్టు అర్హత సాధించే అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలోనూ బంగ్లా విజయాలు అందుకోగా, ఒక విజయం, ఒక ఓటమితో జింబాబ్వే, రెండు పరాజయాలతో శ్రీలంక జట్టు అట్టడుగున ఉంది.



