ట్రంప్‌కు నోబెల్ కాదు.. ఆస్కార్ ఇవ్వాలేమో?

Donald Trump and the Ukraine missile deal

డొనాల్డ్ ట్రంప్‌ ఏం చెప్పారు? తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే పది రోజుల్లోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిపివేయించేస్తానని చెప్పారు.

పది రోజులు కాకపోయినా కనీసం పది నెలల్లో తప్పకుండా వాటి యుద్ధాలకు బ్రేక్ వేస్తారని అందరూ భావించారు. కానీ రెండేళ్లయినా ఆపలేకపోయారు. పైగా ఆయనే ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించారు. తాను స్వయంగా ప్రారంభించిన ఆ యుద్ధాన్ని కూడా ఆయన ఆపలేకపోతున్నారు!

ADVERTISEMENT

సరే! ప్రపంచశాంతి కోసం అమెరికా యుద్ధం చేయకుండా ఉండలేదు. అలాగని ట్రంప్‌ నోబెల్ శాంతి బహుమతి ఆశించకుండా ఉండలేరు. అయితే ఇప్పుడు చర్చ వీటి గురించి కాదు.

రష్యా దగ్గర భారత్‌తో సహా ప్రపంచ దేశాలు చమురు కొంటుంటే, ఆ డబ్బుని యుద్ధం కోసం ఖర్చు చేస్తుంది. దాంతో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు. నోబెల్ శాంతి బహుమతికి అన్ని విధాలా అర్హుడినైన తనకు అది ఎంతమాత్రం ఇష్టం లేదని ట్రంప్‌ స్వయంగా చెప్పారు. తనకు యుద్ధాలు ఆపి, ప్రజల ప్రాణాలు కాపాడటం అంటే చాలా ఇష్టమని కూడా ఆయనే చెప్పుకున్నారు.

కనుక రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల ఎపిసోడ్స్ నడిపిస్తూనే, మరోపక్క చమురు కొనుగోలుకు రష్యాతో ఒప్పందం చేసుకున్నారు. ‘ఇది అమెరికా, ప్రపంచ దేశాల ప్రయోజనాల కోసమే.. నన్ను నమ్మండి,’ అంటున్నారు ట్రంప్‌ దొరవారు.

ఈ చమురు కొనుగోలు ద్వారా రష్యాకు భారీగా ఆదాయం సమకూరుస్తున్నప్పుడు, ఉక్రెయిన్‌ను పట్టించుకోకుండా ట్రంప్‌ అస్సలు ఉండలేరు.

కనుక ఉక్రెయిన్‌కు 500 అత్యాధునిక క్షిపణులు, వాటి అనుబంధ పరికరాలు అందించేందుకు ఒప్పందం చేసుకున్నారు. మన కరెన్సీలో ఈ ఒప్పందం విలువ సుమారు రూ.17,500 కోట్లు!

ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న కెనడా, జర్మనీ, నార్వే తదితర యూరోపియన్ దేశాలు ఈ సొమ్మును సమకూర్చి అందిస్తాయి. దాంతో ఉక్రెయిన్‌ అమెరికా నుంచి ఈ అత్యాధునిక క్షిపణులు కొనుగోలు చేస్తుంది.

అంటే అటు రష్యాకు ఆర్థికంగా సాయపడుతూ, ఇటు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించి సాయపడుతూ వాటి యుద్ధం ఆగకుండా చేస్తున్న ట్రంపే, శాంతి చర్చలు హోస్ట్ చేస్తుండటం విచిత్రంగానే ఉంది కదా?

పనిలో పనిగా ఆయుధాల వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. ఇక ఈ యుద్ధాలు ఆపేయమని ట్రంప్‌ చెప్పినా రష్యా-ఉక్రెయిన్లు వింటాయా?

కనుక ఆయుధ వ్యాపారాలు చేస్తూ, యుద్ధాలు చేస్తూ, చేయిస్తున్న శాంతిదూత డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి కాదు.. ఆస్కార్ అవార్డుకు అన్నివిధాలా అర్హులు. పాపం ఆయన ఆస్కార్ అనబోయి నోబెల్ అంటున్నారేమో?

ADVERTISEMENT
Latest Stories