వైఎస్ వివేక హత్య కేసుతో తమకు ఎటువంటి సంబందమూ లేదని, తాము అమాయకులమని, ఈ కేసు కారణంగా తీవ్ర మనోవేదనతో కుమిలిపోతున్నామని చెప్పుకొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ నుంచి పదేపదే పిలుపులు వస్తూనే ఉన్నాయి.
తామిద్దరం వేరే వ్యాపకాలతో బిజీగా ఉన్నందున విచారణకు హాజరు కాలేమని తెలియజేయడంతో సీబీఐ అధికారులు ఆదివారం రాత్రి మళ్ళీ ఇద్దరికీ నోటీసులు అందజేసారు. అవినాష్ రెడ్డిని ఈనెల 10వ తేదీన హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయంలో ఎట్టి పరిస్థితులలో హాజరుకావాలని ఆదేశించారు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని ఈ నెల 12వ తేదీన కడప జైలులోనే విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు ఆదేశించారు.
ఇప్పటికే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు రెండుసార్లు హైదరాబాద్ పిలిపించుకొని ప్రశ్నించారు. నాలుగేళ్ళుగా ఒక్కసారి కూడా ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించలేకపోయిన సీబీఐ అధికారులు, ఈ కేసు విచారణని హైదరాబాద్ బదిలీ కాగానే రెండు నెలల వ్యవధిలో మూడుసార్లు ప్రశ్నించడం గమనిస్తే ఈ కేసు వేగవంతం చేసిన్నట్లు స్పష్టం అవుతోంది. కనుక నేడో రేపో వివేకా హత్య కేసులో మళ్ళీ అరెస్టులు మొదలవవచ్చు.
ఇక ఈ కేసులో మరో నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అతని భార్య స్వాతి పులివెందులలో బస్టాండ్ సమీపంలో నివసిస్తున్నారు. శనివారం రాత్రి ఇద్దరు దుండగులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి బెదిరించి పారిపోయారు. వెంటనే ఆమె జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి చెప్పారు. ఆయన ఆదేశంతో సీఐ దిల్‌రాజు వెంటనే అక్కడికి చేరుకొని ఆమె చెప్పిన ఆధారాలతో ఇద్దరు దుండగులను అరెస్ట్ చేశారు. కానీ వారెవరూ, వారు ఆమెని ఎందుకు బెదిరించారు?వారిని ఎవరు పంపించారనే విషయం పోలీసులు బయటపెట్టలేదు.



