నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లకు పాటియాలా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కాంగ్రెస్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ రోజు కోర్టుకు హాజరైన సోనియా, రాహుల్ లకు బెయిల్ రాని పక్షంలో వీరిద్దరూ జైలుకు వెళ్తారన్న సమాచారంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎలాంటి సంచలనాలకు తావు లేకుండా… పాటియాలా కోర్టుకు చేరుకున్న కొద్ది నిముషాలకే బెయిల్ మంజూరు అయ్యింది.
50 వేల పూచీకత్తుతో మొత్తం ఎనిమిది మందికి ఈ కేసులో కోర్టు బెయిల్ ఇచ్చింది. సోనియా, రాహుల్ ల వెంట అహ్మద్ పటేల్, మన్మోహన్ సింగ్ వెంట వచ్చారు. ‘చట్టాల అతిక్రమణ జరగలేదని, ఇది కేవలం రాజకీయ కోణంలో జరుగుతుందని,’ సోనియా, రాహుల్ ల తరపున కపిల్ సిబాల్ వినిపించిన వాదనలకు ఫలితం దక్కినట్లయ్యింది. మరో వైపు సుబ్రమణ్యస్వామి స్వయంగా వాదనలు వినిపించారు. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేసినట్లుగా సమాచారం.





