బండి భగీరథ్ పై ఫోక్సో కేసు ఆరోపణలు వినపడిన నాటి నుంచి తెలంగాణ రాజకీయాలలో బండి సంజయ్ పేరు చాల హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లు టి. బీజేపీ నాయకుడిగా, తెలంగాణ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షడిగా, కేంద్ర మంత్రిగా, ఎంపీ గా మీడియాలో బండికి జరగని ప్రచారం ఆయన సన్ స్ట్రోక్ తో ప్రాంతీయ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు బండి సంజయ్ పేరు మారుమోగుతోంది.
ఇటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి ఆ పార్టీ శ్రేణుల వరకు బండి సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి నుంచి భర్తరప్ చెయ్యాలంటూ బీజేపీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు, ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ టి. బీజేపీ పై ఒత్తిడి చేస్తున్నారు. ఇక అధికార కాంగ్రెస్ సైతం బండి భగీరథ్ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామంటూ హామీ ఇస్తున్నారు.
ఇక ఈ కేసులు, వివాదాలు అన్ని కూడా బండి కుటుంబ వ్యవహారాలని, వీటన్నిటికీ బీజేపీ పార్టీ కి ఎటువంటి సంబంధం ఉండదని, అలాగే బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణలకు ఆయన తండ్రి బండి సంజయ్ పై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సబబు సబబు అంటూ టి. బీజేపీ నేతలు తమ స్వరం పెంచుతున్నారు.
ఇదిలా ఉంటే మరోపక్క బండి రాజకీయ భవిష్యత్ ఏమిటి.? ఏమవుతుంది.? ప్రత్యర్థి పార్టీల రాజకీయ ఒత్తిడికి బీజేపీ అధిష్టానం తలవంచుతుందా.? ఆయన పై చర్యలకు ఆదేశాలు ఇస్తుందా.? అంటూ అనేక ఊహాగానాలు, బీజేపీ ని కాదని బండి సంజయ్ మరో కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాలలోకి అడుగుపెట్టబోతున్నారంటూ మరికొన్ని ప్రచారాలు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన బండి సంజయ్ కొత్త పార్టీ ఏర్పాటు అంటూ వస్తున్న వార్తల పై స్పందించారు. ఇవన్నీ ఫాల్తు రాజకీయాలని, కొత్త పార్టీ పెట్టాలనుకునే ఫాల్తు కాదు నేను అంటూ చెప్పుకొచ్చిన బండి తనకు ఉరిశిక్ష వేసే ముందు కూడా బీజేపీ కార్యకర్త ని అడిగితే మా బీజేపీ జెండా కప్పమంటాను అంటూ తానూ ఒక కరుడుగట్టిన బీజేపీ కార్యకర్తను అని చెప్పుకునే ప్రయత్నం చేసారు.
అయితే కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ బీజేపీ ని కాదని బయటకు వచ్చే సాహసం చేస్తారా.? అందునా తన కొడుకు బండి భగీరథ్ పై ఫోక్సో వంటి బలమైన కేసు ఉన్న నేపథ్యంలో ఆ కేసులో అరెస్టయ్యి జైలుకు వెళ్లిన సందర్భంలో బండి సంజయ్ బీజేపీ ని దాటి అడుగు ముందుకు వెయ్యగలరా.? అసలు ఆయన అటువంటి ఆలోచన చేసేందుకైనా సాహసించగలరా.?




