అగ్రరాజ్యం అంటే చాలు… అమెరికా అని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. అమెరికా అంతగా అభివృద్ధి చెందింది కనుకనే భారత్‌తో సహా ప్రపంచ దేశాల ప్రజలు అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించి అక్కడే స్థిరపడాలని ఆరాట పడుతుంటారు.
కనుకనే విదేశీయులు, విదేశీ ఉత్పత్తులు, విదేశీ సేవలు ఏవీ మాకు అక్కరలేదు…. ‘అందరూ గెటవుట్’ అన్నట్లు ట్రంప్ చాలా చులకనగా వ్యవహరిస్తున్నారు. కానీ దశాబ్దాల తరబడి విదేశీయుల సేవలతోనే అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగిందనే విషయం అందరికీ తెలుసు.
కానీ నేటికీ అమెరికాలో 4.7 కోట్ల మందికి పైగా ప్రజలు రెండు పూటలా కడుపు నిపుకోలేక అవస్థపడుతున్నారు. ప్రతీ ఐదుగురు పిల్లలలో ఒకరు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ మాట అన్నది మరెవరో కాదు… అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా!
ఇంకా ఆయనేమన్నారంటే, నానాటికీ కాస్ట్ ఆఫ్ లివింగ్ (నిత్యావసర సరుకుల ధరలు, ఛార్జీలు, అద్దెలు) పెరిగిపోతూనే ఉంది. ఈ కారణంగా అమెరికన్ పౌరులు కడుపు నింపుకోవడానికి ఫుడ్ స్టాంప్స్, స్నాప్ వంటి ఆహార భద్రత పధకాలపై ఆధారపడుతున్నారు.
కనుక రిపబ్లికన్స్ (డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం) కనీసం ఇప్పటికైనా వారందరికీ ఆహార భద్రత కల్పించాలి. లేకుంటే రాబోయే క్రిస్మస్ హాలీడేస్‌లో వృద్ధులు, చిన్నారులు, తక్కువ ఆదాయం కలిగిన అమెరికన్ పౌరులు ఆకలితో గడపాల్సి వస్తుంది,” అని బారక్ ఒబామా ట్వీట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు ఎంతసేపు యుద్ధాలు ఆపేస్తూ ప్రపంచ శాంతి నెలకొల్పడం గురింఛి లేదా వాణిజ్య పన్నులు, రష్యా నుంచి భారత్, చైనాలు చమురు కొనుగోలు గురించే మాట్లాడుతుంటారు. కానీ అగ్రరాజ్యం సూటు కింద చిరిగిన చొక్కాలున్నాయని బారక్ ఒబామా గుర్తు చేస్తున్నారు.
క్రిస్మస్ సెలవులలో అమెరికన్ పౌరులు ఆకలితో జీవించే పరిస్థితి ఉన్నప్పుడు మొదట వారందరికీ కూడు, గుడ్డ, గూడు, ఉపాధి కల్పించడమే ప్రాధాన్యత కావాలి. కానీ అమెరికాలో 4.7 కోట్ల మంది ఆకలితో మాడుతుంటే, ట్రంప్ ప్రపంచాన్ని ఉద్దరించే బాధ్యత తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అంటే ఇదేనేమో?







