ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకతను సొంతం చేసుకున్న బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) అతి త్వరలో తెలుగులో కూడా తమ సేవలను విస్తరించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 1922లో స్థాపించిన బీబీసీ వరల్డ్ సర్వీస్, 1940 తర్వాత చేపట్టిన భారీ విస్తరణలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 11 భాషల్లో కొత్తగా సేవలు అందించనుందని సంస్థ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ స్పష్టం చేసారు. 2017 నుండి ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని సమాచారం.
ఆసియా భాషల్లో తెలుగు, గుజరాతీ, మరాఠీ, పంజాబీ వుండగా, ఆఫ్రికన్ భాషల్లో అఫాన్ ఒరామా, అమ్హారిక్, ఇగ్బో, కొరియన్, పిడ్గిన్, తిగ్రిన్యా, యోరుబా ఉన్నట్లు బీబీసీ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో అతి పెద్ద బ్యూరోను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ విస్తరణ ద్వారా 157 మందికి కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయని, ఈ తాజా విస్తరణతో బీబీసీ ఇంగ్లీషు సహా మొత్తం 40 భాషలకు బీబీసీ విస్తరిస్తుందని, 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్ ప్రేక్షకులకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యంగా పేర్కొన్నారు.



