సినీ ఇండస్ట్రీ సెంటిమెంట్స్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మహేష్ బాబు సినిమాల విషయంలో ఇది ఎక్కువగా రిపీట్ అవుతూనే ఉంది. తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడితో మళ్ళీ సినిమా చేస్తే, అది ప్రతికూల ఫలితాన్ని ప్రిన్స్ కు ఇస్తుందన్న విషయం ఇప్పటికే త్రివిక్రమ్ తో సహా శ్రీనువైట్ల, శ్రీకాంత్ అడ్డాల, గుణశేఖర్ ల విషయంలో నిరూపణ అయ్యింది. పూరీ ఇందుకు కాస్త మినహాయింపు లేండి! తాజాగా ‘శ్రీమంతుడు’ తర్వాత ‘భరత్ అనే నేను’ సినిమాతో కొరటాలతో ప్రిన్స్ పని చేస్తున్న వైనం తెలిసిందే.
ఈ సెంటిమెంట్ ఇలా ఉంటే, ఇప్పటివరకు మహేష్ నటించిన 23 సినిమాలలో, కేవలం నాలుగు చిత్రాలలో మాత్రమే టాలీవుడ్ కు హీరోయిన్లను పరిచయం చేసారు. అందులో మూడు సినిమాలు దారుణ పరాజయం పాలు కావడం విశేషం. ‘వంశీ’ సినిమాలో నమ్రత, ‘టక్కరి దొంగ’ సినిమాలో బిపాసా, లీసారే, ‘1 నేనొక్కడినే’ సినిమా ద్వారా కృతిసనన్ ల ప్రయోగాలు విఫలం కాగా, ‘మురారి’లో సోనాలిబింద్రే పరిచయం ఒక్కటే సక్సెస్ ఫుల్ ఫిల్మ్ గా నిలిచింది. తాజాగా ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా కియార అద్వాని అనే ముద్దుగుమ్మ పరిచయం కాబోతోంది.
ఈ రెండు బలమైన సెంటిమెంట్స్ “భరత్ అనే నేను”కు ప్రతికూలంగా మారినప్పటికీ, వీటిని పట్టించుకోవాల్సిన పని లేదని అంటున్నారు అభిమానులు. గతంలో మహేష్ నటించిన సినిమాలకు మూడక్షరాల టైటిల్స్ పెడితే సూపర్ హిట్ కొట్టడం ఖాయం అనే వారు, కానీ దీనికి మధ్య మధ్యలో ‘అర్జున్, ఆగడు’ అనే సినిమాలు బ్రేక్ వేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. సినిమాలో విషయం ఉండాలే గానీ, ఈ సెంటిమెంట్స్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అనేది రాజమౌళి వంటి వారు కూడా చాలా సందర్భాలలో చెప్పిన విషయం.



