దేశంలో ఎన్ని రకాల వ్యాపార అవకాశాలున్నాయో కొత్తగా పుట్టుకొస్తున్న రకరకాల యాప్‌లు, సంస్థలు అనుభవపూర్వకంగా చూపిస్తున్నాయి.
ఉదాహరణకు అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ ప్రవేశంతో భారతీయ మార్కెట్ ఒక్కసారిగా మారిపోయింది.అ తర్వాత బిగ్ బాస్కెట్, బ్లింకిట్ వంటివి మరో కొత్త మార్గం సృష్టించాయి.
ఎవరూ ఊహించని విధంగా స్విగ్గీ, జొమోటోలు ప్రవేశించి ఇంటికే ఆహారం తెచ్చి ఇస్తున్నాయి. ఇక ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి సంస్థలు దేశవ్యాప్తంగా ఎంతగా అల్లుకుపోయాయో అందరూ చూస్తూనే ఉన్నారు. అవే కంపెనీలు మరో కొత్త ఆలోచన చేసి చిన్న చిన్న పార్సిల్ సేవలు కూడా అందిస్తూ లాభాలు గడిస్తున్నాయి.
కనుక కొత్త ఆలోచనతో వస్తే భారత్‌లో అతిపెద్ద మార్కెట్ ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది. ఈ ప్రైవేట్ సంస్థలన్నీ లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ప్రజలకు అద్భుతమైన సేవలు అందిస్తూ ప్రశంశలు పొందుతున్నాయి. కానీ అవి తమ ఉద్యోగుల విషయంలో చాలా దారుణంగా వ్యవహరిస్తుండటం బాధాకరం.
ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు గడిస్తున్నప్పటికీ వాటి కోసం పని చేసే డ్రైవర్లు మాత్రం దయనీయ స్థితిలో ఉన్నారు. వారు ఎండనక, వాననక, రేయనక, పగలనక, పండగలు, పబ్బాల సమయంలో కూడా సేవలు అందిస్తున్నారు.
కానీ వారి కష్టార్జితంలో 25 శాతం ఆయా సంస్థలు తీసేసుకుంటాయి. అవి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు సొంత లాభం కూడా చూసుకోవాలి కనుక వాటిని తప్పు పట్టలేము!
కనుక ఈ రంగంలో ఉన్న డ్రైవర్లకు, నిరుద్యోగ యువతీ యువకులకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి, సంపాదనతో పాటు ఆత్మగౌరవం కూడా పొందేలా ‘భారత్ టాక్సీ’ అనే కొత్త వ్యవస్థని ఏర్పాటు చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ‘సహకార టాక్సీ కో ఆపరేటివ్ లిమిటెడ్’ అనే ఓ సంస్థను ఏర్పాటు చేసింది. దాని ఆధ్వర్యంలోనే భారత్ టాక్సీ పనిచేస్తుంది. ఇది కూడా ర్యాపిడో, ఊబర్, ఓలా తదితర కంపెనీలలాగే పనిచేస్తుంది. బైక్, స్కూటీ, ఆటో, కార్లతో సేవలు అందిస్తుంది.
దీనిలో సభ్యత్వ నమోదు కోసం మొదటిసారి కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బైక్, ఆటో, కారు రైడర్లు ఎంత సంపాదించుకుంటారో అదంతా వారికే సొంతం. ఎవరూ ఎవరికీ ఎటువంటి కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు!
ముందుగా నవంబర్ నుంచి ఢిల్లీలో 650 టాక్సీలతో భారత్ టాక్సీని ప్రయోగాత్మకంగా నడిపిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఈ ఏడాది డిసెంబర్ నుంచే దేశంలో అన్ని ప్రధాన నగరాలకు ఆ తర్వాత పట్టణాలకు విస్తరిస్తారు.




