తిరుమల శ్రీవారి హుండీలు… గోవిందా!

Srivari-Hundi-TTD

రాష్ట్రంలో మౌలికవసతుల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకు ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తోంది. కానీ వైసీపి ప్రభుత్వం తిరుపతి పట్టణంలో రోడ్ల నిర్మాణం, పారిశుద్య పనుల కోసం తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకొన్న నగదు కానుకల నుంచి రూ.100 కోట్లు తీసి తిరుపతి కార్పొరేషన్‌కి ఇచ్చేసింది.

ADVERTISEMENT

అంతటితో ఆగలేదు. టిడిపి పాలక మండలిలో ఎలాగూ అందరూ ‘మనోళ్ళే’ కనుక తిరుమల హుండీని ఏటిఎమ్‌లా వాడేసుకొనేందుకు పకడ్బందీ ప్లాన్ కూడా వేశారు. టిటిడి బడ్జెట్‌లో ఏటా ఒక్క శాతం నిధులు తిరుపతి కార్పొరేషన్‌కి ఇవ్వాలని పాలక మండలి తీర్మానించేసింది. కానీ విమర్శలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.

అయితే తిరుమల శ్రీవారి హుండీపై కన్నేసిన వైసీపి మళ్ళీ ఇటువంటి ప్రయత్నం చేయక మానదని భావించిన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. దేవాదాయ చట్టంలో సెక్షన్ 111 ప్రకారం తిరుమల శ్రీవారి ఆదాయాన్ని ఇతర అవసరాలకు మళ్ళించడం విరుద్దమని, కనుక ఇకపై టిటిడి నిధులు మళ్లించకుండా టిటిడిని ఆదేశించాలని కోరారు.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు టిటిడి నిధులను తిరుపతి పారిశుధ్య పనులతో సహా ఇతర అవసరాలకు ఉపయోగించరాదని స్పష్టం చేసింది. టిటిడి నిధులతో సంబంధం లేకుండా తిరుపతిలో పారిశుధ్య పనులు, వాటి కోసం టెండర్ల ప్రక్రియ నిర్వహించుకోవాలని సూచించింది. దీనిపై టిటిడికి, తిరుపతి కార్పొరేషన్‌లను కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశిస్తూ హైకోర్టు నోటీసులు పంపింది.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ఆర్ధిక వృద్ధిరేటు అద్భుతంగా ఉందని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి బల్లగుద్ది వాదిస్తుంటారు. కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతోంది రాష్ట్ర ప్రభుత్వం.

ఇప్పుడు శ్రీవారికి భక్తులు సమర్పించుకొంటున్న సొమ్ముని తీసి వాడుకోవాలనుకోవడం గమనిస్తే తిరుపతి పట్టణంలో రోడ్లు వేయడానికి, చివరికి పారిశుధ్య పనులకు కూడా ప్రభుత్వం వద్ద డబ్బు లేదని దీంతో స్పష్టమవుతోంది.

ఇప్పుడు తిరుపతిలో రోడ్లు, పారిశుధ్యం పేరు చెప్పి శ్రీవారి హుండీలో డబ్బు తీసి వాడుకొనేందుకు అవకాశం లభిస్తే రేపు రాష్ట్రంలో రాష్ట్రంలో అన్ని ప్రధాన దేవాలయాల హుండీలను ఖాళీ చేయకుండా ఉంటుందా?జిల్లాల అభివృద్ధి పేరుతో హుండీలలో డబ్బు తీసి వాడుకోకుండా ఉంటుందా?చివరికి వైసీపి ఎన్నికల ఖర్చులు కూడా తిరుమల హుండీలా నుంచే తీసినా ఆశ్చర్యం లేదు. కనుక తప్పనిసరిగా దీనికి అడ్డుకట్ట వేయాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories