త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికలకు గాను టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలకు పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. అయితే ఆ పొత్తులో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే విషయంలో మూడు పార్టీల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయి.
నిన్న రాత్రి జనసేన అధినేత పవన్ తో భేటీ అయినా బీజేపీ పెద్దలు తాజాగా పవన్ తో కలిసి ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ సమావేశానికి బీజేపీ తరుపున కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండే, జనసేన అధినేత పవన్, నాదెండ్ల మనోహర్, టీడీపీ నుంచి బాబు తో కలిసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే లు గొట్టిపాటి రవి కుమార్, అనగాని సత్య ప్రసాద్ లు పాల్కొన్నారు.
టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా 5 ఎమ్మెల్యే స్థానాలను ప్రకటించిన పవన్ ఈ రోజు నిడదవోలు నుంచి జనసేన తరుపున కందుల దుర్గేష్ పేరుని ఫైనల్ చేస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. దీనితో జనసేన 6 ఎమ్మెల్యే సీట్లను ప్రకటించినట్లయ్యింది. ఇక మిగిలిన 18 స్థానాలకు గాను జనసేన, 6 స్థానాలకు గాను బీజేపీ తమ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది.
అలాగే టీడీపీ నుంచి మొత్తం 94 స్థానాల్లో తమ అభ్యర్థులను ఖరారు చేసిన బాబు మిగిలిన స్థానాలలో కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు బాబు నివాసంలో మూడు పార్టీల నేతలు కూలంకుషంగా చర్చించి తుది నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. ఈ కూటమికి సంబంధించిన పూర్తి జాబితా మార్చి 13 లేదా 14 తేదీలలో ప్రకటించే అవకాశం ఉంది.
ఇక ఒక్కసారి మూడు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ ఒక కొలిక్కి వస్తే.., మూడు పార్టీలు కలిసి అధికార పార్టీపై మూకుమ్మడి దాడి చేసే అవకాశం ఉంది. ప్రధాని మోడీ హాజరుకాబోతున్న మూడు పార్టీల ఉమ్మడి భారీ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి అంకురార్పణ మొదలయినట్టే అంటున్నారు టీడీపీ శ్రేణులు.




