“సరైనోడు” సినిమా విడుదల తర్వాత సినీ ప్రేక్షకుల మదిలో మెదిలిన ప్రశ్న ఇది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకుల అంచనాలను అందుకోక పోవడంతో… బోయపాటి తదుపరి సినిమా హీరో ఎవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో హల్చల్ చేసిన సమాచారం మేరకు బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా ఒక సినిమాను ఒప్పుకున్నారు.
వాస్తవానికి ‘సరైనోడు’ సినిమాకు ముందు బోయపాటి ఆ సినిమాకే దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే స్క్రిప్ట్ వర్క్ పూర్తి స్థాయిలో వర్కౌట్ కాకపోవడంతో, బెల్లంకొండ సినిమాను పక్కన పెట్టి గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ హీరోగా ‘సరైనోడు’ సినిమా పని పట్టాడు. అయితే సక్సెస్ ను కొలమానంగా భావించే సినీ ఇండస్ట్రీలో ‘సరైనోడు’ ఫలితం బోయపాటికి ఏ మేరకు దోహదం చేస్తోందన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
దర్శకుడిగా బోయపాటి టేకింగ్ కు విమర్శలు వ్యక్తం కానప్పటికీ, ఎంచుకున్న కధ, కధనం, లాజిక్ లేని సన్నివేశాలు బోయపాటిని ఒక మెట్టు కిందికి జరిపాయన్నది విమర్శకుల అభిప్రాయం. “1 నేనొక్కడినే” వంటి ఒక వినూత్నమైన సినిమాను తెరకెక్కించి తన కళా ప్రతిభను చాటుకున్నాక కూడా దర్శకుడిగా సుకుమార్ మరో సినిమా కోసం దాదాపు మూడేళ్ళు వెచ్చించాల్సి వచ్చింది. మరి రొటీన్ మాస్ మసాలా మూస కధను ఎంపిక చేసుకుని బోయపాటి నెక్స్ట్ మూవీ కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేస్తారో చూడాలి.



