బ్రహ్మోస్ క్షిపణుల సత్తా ఏమిటో యావత్ ప్రపంచ దేశాలకు ముఖ్యంగా… పాకిస్తాన్‌కి బాగా తెలిసి వచ్చింది. పాకిస్తాన్‌కి అండగా చైనా, తుర్కియే, పరోక్షంగా అమెరికా ఉన్నప్పటికీ భారత్‌ని ఎదుర్కోలేకపోయింది. బ్రహ్మోస్ క్షిపణులు వచ్చి పడిన తర్వాత ట్రంప్‌ని వేడుకొని యుద్ధం ముగింపజేసుకుంది.
అయినా భారత్‌తో ప్రత్యక్ష యుద్ధం చేసి ఓడించాలనే పాక్ పాలకులు, సైన్యాధికారుల తపన ఏమాత్రం తగ్గడం లేదు. కానీ పాక్ కవ్వింపులను భారత్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే కొన్నేళ్ళ క్రితం జరిగిన కార్గిల్ వార్, సర్జికల్ స్ట్రైక్, ఈ ఏడాది మే 7-10 తేదీలలో జరిగిన ఆపరేషన్ సింధూర్‌తోనే పాక్ సత్తా ఏపాటిదో తేలిపోయింది కనుక!
అయితే ప్రతీసారి పాక్ కవ్వింపులు లేదా ఉగ్రదాడులే భారత్-పాక్ యుద్ధం మొదలవడానికి కారణం కానవసరం లేదు. భారత్‌లో ఎప్పుడు ఏ ముఖ్యమైన ఎన్నికలు జరుగుతున్నా మోడీ ప్రభుత్వం ఎదో వంకతో పాకిస్తాన్‌పై దాడి చేయడం, అది చూపించి ఎన్నికలలో గెలుస్తుండటం పరిపాటి అయిపోయిందని పాక్ మంత్రులు విమర్శిస్తుంటారు. వాటిని పూర్తిగా కొట్టి పారేయలేము.
ఎందువల్లనంటే… రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రంలో పర్యటించారు. ఇక్కడ తయారైన మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను ఆయన భారత్ ఆర్మీకి అప్పగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమే. పాకిస్తాన్‌కి జన్మనిచ్చిన భారత్ తలుచుకుంటే ఏం చేయగలదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్‌లో ప్రతీ అంగుళం బ్రహ్మోస్ పరిధిలో ఉంది. వాటి నుంచి పాక్ తప్పించుకోలేదనే విషయం పాక్ పాలకులు బాగా గుర్తుంచుకోవాలి,” అని హెచ్చరించారు.
బ్రహ్మోస్ గొప్పదనం గురించి చెప్పుకోదలిస్తే, వాటిని పాక్‌పై ప్రయోగించినప్పుడు అవి ఎంత విధ్వంసం సృష్టించాయో చెప్పవచ్చు. కానీ ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని, బ్రహ్మోస్ పరిధిలో పాక్ ఉందని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించడం అసందర్భమే.
నవంబర్ 6, 14 తేదీలలో బీహార్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈసారి బీహార్ ముఖ్యమంత్రి పదవి బీజేపిదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన ప్రాయంగా చెప్పారు. కనుక ఈ ఎన్నికలు బీజేపికి చాలా చాలా కీలకమైనవి.
కనుక బీహార్ ఎన్నికల కోసం మరోసారి బ్రహ్మోస్ వాడాలనే ఆలోచన ఉందేమో?పాక్ మంత్రులు చేస్తున్న ఈ ఆరోపణలు నిజమో కావో ఆలోగా తెలుస్తుంది.




