‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కాంభినేషన్లో విడుదలైన “బ్రహ్మోత్సవం” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘శ్రీమంతుడు’ వంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న తర్వాత మహేష్ నటించిన సినిమా కావడం ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసాయి. అయితే వాటిని అందుకోవడంలో సినిమా విఫలమైందనే టాక్ సినీ విశ్లేషకుల నుండి వ్యక్తమైంది. మరి ఈ టాక్ సినిమా ఓపెనింగ్స్ పై ఏ మేరకు ప్రభావాన్ని చూపిందనేది ఆసక్తికరంగా మారింది.
ట్రేడ్ వర్గాల నుండి లభిస్తున్న సమాచారం మేరకు తొలి రోజు తీవ్ర నిరాశజనకమైన కలెక్షన్స్ ను సాధించిందని తెలుస్తోంది. ‘శ్రీమంతుడు’ సినిమా ఓపెనింగ్స్ ను కూడా అందిపుచ్చుకోలేదని, మరొక దారుణమైన విషయం ఏమిటంటే… గత కొన్ని సంవత్సరాలుగా పరాజయం అంటూ ఎరుగని ప్రిన్స్ ఓవర్సీస్ అడ్డాలో ‘బ్రహ్మోత్సవం’ ఆశించిన మేరకు అంచనాలను అందుకోలేక చతికిలపడడం విశేషం. ప్రీమియర్ షో కలెక్షన్స్ తో పోలిస్తే, తదుపరి కలెక్షన్స్ సగానికి పైగా పడిపోయాయని సమాచారం.
అయితే ఇంత తక్కువ ఓపెనింగ్స్ కు కారణాలు అన్వేషిస్తే… సినిమా విడుదలకు ముందు రోజు నుండి ఏపీ, తెలంగాణాలలో వాతావరణం పూర్తిగా మారిపోయి వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం… ఓపెనింగ్స్ పై పెను ప్రభావం చూపింది. అగ్నికి వాయువు తోడైనట్లు… వాతావరణ పరిస్థితులకు తోడు, సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ ఓపెనింగ్స్ ను మరింతగా దిగజార్చాయి. లేదంటే మహేష్ స్థాయి హీరోకు మొదటి రోజు దక్కే ఓపెనింగ్స్ కాదని ట్రేడ్ వర్గీయులు ధృవీకరిస్తున్నారు.
టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించగల హీరోలలో ప్రిన్స్ ఒకరని చెప్పడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ప్రిన్స్ సినిమాకే మొదటి రోజు ఆశించిన మేరకు వసూలు చేయకపోవడం, అది మొదటి రోజు వరకే పరిమితం అవుతుందా? లేక ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా? అనేది రెండు, మూడు రోజుల్లో తేలనుంది. ఇక, ఓవర్సీస్ విషయానికి వస్తే… ప్రీమియర్ షోలకు వచ్చిన టాక్ ‘బ్రహ్మోత్సవం’పై చాలా ప్రభావాన్ని చూపాయని సాధించిన కలెక్షన్స్ చెబుతున్నాయి.
ఇదే ట్రెండ్ కొనసాగితే డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పవన్న సంకేతాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో… రెండవ రోజు నుండి ‘ట్రిమ్మింగ్’కు గురైన ‘బ్రహ్మోత్సవం’ ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందనలు తీసుకువస్తుందో అని చిత్ర యూనిట్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మొదటి రోజు జరిగిన డ్యామేజ్ కు ‘బ్రహ్మోత్సవం’ టీం చేసిన రిపేర్లు ప్రభావం చూపని పక్షంలో ప్రిన్స్ కెరీర్లో భారీ నష్టాన్ని చవిచూసిన చిత్రంగా ‘బ్రహ్మోత్సవం’ నిలుస్తుందన్న సూచనలు వస్తున్నాయి.



