కేసీఆర్‌ గారు… మీ టికెట్‌ నాకొద్దు… మీకో దణ్ణం!

kadiyam-kavya

తెలంగాణ రాజకీయాలను శాసించిన కేసీఆర్‌, డబ్బు మూటలతో దేశ రాజకీయాలను కూడా శాసించాలనుకున్నారు. కానీ ఏమైందో అందరికీ తెలుసు. ఒకే ఒక్క ఓటమితో తెలంగాణలో ఆ పార్టీ తుడిచి పెట్టుకుపోతోంది. అదీ… ఎన్నికలలో ఓడిపోయిన 3-4 నెలల్లోనే కావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఇంతకాలం కేసీఆర్‌ వాపుని చూసి బలుపు అనుకున్నారనుకోవాలేమో?

ADVERTISEMENT

ఆ పార్టీ సెక్రెటరీ జనరల్, ఎంపీ కే కేశవరావుతో పాటు ఆయన కుమార్తె, హైదరాబాద్‌ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇద్దరూ కారు దిగి హస్త ప్రక్షాళన చేసుకోబోతున్నామని చెప్పేశారు.

కేసీఆర్‌ వారిరువురినీ తిట్టుకుంటూ ఉండగానే పార్టీలో మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా మరో షాక్ ఇచ్చారు.

ఆయన పట్టుబట్టి తన కూతురు కడియం కావ్యకు వరంగల్‌ టికెట్‌ ఇప్పించుకున్నారు. కానీ నేను పోటీ చేయడం లేదంటూ కేసీఆర్‌కు ఓ లేఖ వ్రాశారు. ఆమెకు టికెట్‌ ఇస్తే సంతోషంగా తీసుకొని ఇప్పుడది తనకు అక్కర్లేదని చెప్పడమే కేసీఆర్‌కు పెద్ద షాక్ అనుకుంటే, అందుకు ఆమె పేర్కొన్న కారణాలు కేసీఆర్‌కు చెంప దెబ్బ వంటివే అని చెప్పొచ్చు.

గురువారం రాత్రి ఆమె కేసీఆర్‌కు పంపిన లేఖలో, “గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్‌ లాంటి వ్యవహారాలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి.

మీరు నాకు సహృదయంతో టికెట్‌ ఇచ్చినప్పటికీ జిల్లా నాయకుల మద్య సమన్వయం, సహకారం లేదు. ఈ పరిస్థితులలో నేను పోటీ చేయలేను కనుక విరమించుకుంటున్నాను. అందరూ నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను,” అని వ్రాశారు.

ఈరోజు ఆమె తన తండ్రి కడియం శ్రీహరితో కలిసి ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిపోబోతున్నట్లు తాజా సమాచారం. కొన్ని రోజుల క్రితం కడియం శ్రీహరి తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందన్నారు. కానీ ఇప్పుడు ఆయన అదే కాంగ్రెస్ పార్టీలో చేరిపోబోతున్నారు!

కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరూ పార్టీ సమావేశాలలో సిఎం రేవంత్‌ రెడ్డిని, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ, వాటిని పార్టీలో నేతలే పట్టించుకోవడం లేదని ఈ తాజా వలసలతో స్పష్టం అవుతోంది.

బిఆర్ఎస్‌ పార్టీ చాలా క్లిష్టంగా ఉందని, కడియం కావ్య పేర్కొన్న వాటితో పార్టీ ప్రతిష్ట మసక బారుతోందని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులకు తెలియదనుకోలేము. కానీ ఇప్పుడు కేసీఆర్‌ కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది కనుక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఖాళీ అయిపోతున్న పార్టీని నిసహాయంగా చూస్తున్నారు. కేసీఆర్‌ చేసిన యాగాలు, పూజలు, వాస్తు ఏవీ ఫలించలేదు కానీ టిఎస్‌ఆర్టీసీ సమ్మె సమయంలో చనిపోయిన 43 మంది కార్మికుల కుటుంబాల ఉసురు, ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయి రోడ్డున పడ్డ నిర్వాసితుల ఉసురు మాత్రం కేసీఆర్‌కు బాగానే తగిలినట్లున్నాయి.

ADVERTISEMENT
Latest Stories