రాజకీయ నాయకుడు ప్రజల మద్య ఉండాలి. కానీ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడూ కూడా ఫామ్‌హౌస్ విడిచిపెట్టడం లేదు. అక్కడే ఉంటూ పార్టీ నేతలు, కార్యకర్తలను, ప్రజలను తన వద్దకే రప్పించుకొని రోజూ పాఠాలు చెపుతున్నారు.
బిఆర్ఎస్ పార్టీని వీడి ఎవరూ వెళ్ళవద్దని అందరూ కష్టపడి పనిచేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెపుతున్నారు. బిఆర్ఎస్ పార్టీని వీడినవారందరూ ద్రోహులే… పోయి దొంగల ముఠాలో చేరుతున్నారని కేసీఆర్ చెపుతున్నారు. అంటే తనను నమ్ముకొని పార్టీలో ఉన్నంతకాలం మంచివాళ్ళే కానీ బయటకు వెళ్ళితే దొంగలని కేసీఆర్ చెపుతున్నారన్న మాట!
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ళలో ఏనాడూ ఇలా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ప్రజలతో కూర్చొని మాట్లాడింది లేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వారందరి అవసరం, ప్రాధాన్యత తెలిసి వచ్చిన్నట్లుంది.
కానీ లోక్‌సభ ఎన్నికలలో మరోసారి ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్ ప్రజల మద్యకు వెళ్ళకుండా, వారినే తన ఫామ్‌హౌస్‌కి పిలిపించుకొని పాఠాలు చెపుతుండటం గమనిస్తే, ఆయనలో ‘దొరతనం’ ఇంకా అలాగే ఉందని అర్దమవుతోంది. పైగా బిఆర్ఎస్ పార్టీ ఓటమికి తాను కారకుడు కాదని కేసీఆర్ అందరినీ నమ్మించే ప్రయత్నంలో ప్రజలే మోసపోయారని చెపుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కేసీఆర్ ఎంతగా నచ్చజెపుతున్నప్పటికీ నెలకు ఒకరిద్దరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతూనే ఉన్నారు.
ఈ 15 రోజుల్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 39 నుంచి 32కి పడిపోగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 65 నుంచి 71కి పెరిగింది.
కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం నుంచి క్రమంగా బయటపడుతుంటే, కూల్చేద్దామనుకున్న కేసీఆర్ పార్టీ ఖాళీ అయిపోతోంది.
అయినా కేసీఆర్ ఇంకా ఫామ్‌హౌస్‌కి జనాలను రప్పించుకొని ‘గుణాత్మకమైన మార్పు’ వస్తుందని పాఠాలు చెపుతూనే ఉన్నారు. కానీ ముందు ఆయనలోనే మార్పు రావాల్సిన అవసరం ఉందని ఎవరూ చెప్పడం లేదు.
ఏపీలో జగన్ 175 సీట్లు మనకే అని చెపుతున్నప్పుడు ‘నీ ఆలోచన, ధోరణీ రెండూ సరికావని’ వైసీపి నేతలు ఎవరూ ధైర్యం చేసి చెప్పకపోవడం వలననే ఎన్నికలలో వైసీపి ఓడిపోయింది. ఆ ఫలితాలు చూసినప్పుడు జగన్‌కు హిమాలయాలకు వెళ్ళిపోవాలన్నంత విరక్తి కలిగిందట!
బిఆర్ఎస్ పార్టీలో కూడా ఎవరూ కూడా కేసీఆర్‌కు ఎదురు చెప్పడం లేదు. కనుక కేసీఆర్ కూడా ఏదో రోజున జగన్‌తో కలిసి హిమాలయాలకు వెళ్ళిపోకతప్పదేమో?




