పాపం కేసీఆర్‌… అభ్యర్ధులే కరువాయె!

KCR BRS

తెలంగాణ శాసనసభ ఎన్నికల వరకు కూడా బిఆర్ఎస్ పార్టీలో టికెట్ల కోసం అనేక మంది పోటీ పడేవారు. కానీ ఎన్నికలలో ఓడిపోగానే ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు టికెట్స్ ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు. బిఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతలైన మల్లారెడ్డి, గుత్తాసుఖేందర్ రెడ్డి మాకు టికెట్స్ అక్కరలేదని చెప్పేశారు. రంజిత్ రెడ్డి వంటి మరి కొంతమంది ఎంపీలు మళ్ళీ టికెట్‌ ఇస్తామని చెప్పినా పార్టీకి రాజీనామాలు చేసే కాంగ్రెస్‌, బీజేపీలో చేరిపోయారు.

తెలుగుదేశం, కాంగ్రెస్‌, వైసీపీ, బీజేపీ ఇంకా చాలా పార్టీలు అనేకసార్లు ఎన్నికలలో ఓడిపోయాయి. తెలంగాణలో ఈ పార్టీలను కేసీఆర్‌ నిర్వీర్యం చేశారు కూడా. అయినా ఏ పార్టీకి ఇంత గడ్డు పరిస్థితి రాలేదు.

ADVERTISEMENT

కానీ రెండున్నర దశాబ్ధాల పాటు కంటి సైగతో తెలంగాణను శాశించిన కేసీఆర్‌కు 17 ఎంపీ సీట్లకు 17 మంది అభ్యర్ధులు దొరకడం లేదు.

తెలంగాణలో ఏ పార్టీలో అయినా అత్యంత డిమాండ్ ఉండే సీటు మెదక్ ఎంపీ సీటు. కానీ దానికి బిఆర్ఎస్‌ పార్టీలో ఎవరూ ముందుకు రాకపోవడంతో, మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామి రెడ్డి పేరు ఖరారు చేశారు.

గతంలో ఆయన కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు కేసీఆర్‌కు బహిరంగంగా పాదాభివందనాలు చేసి విధేయత చూపేవారు. అందుకు ప్రతిగా కేసీఆర్‌ ఆయన చేత ఆ పదవికి రాజీనామా చేయించి, బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు పార్టీలో మరెవరూ ముందుకు రాకపోవడంతో మెదక్ ఎంపీ సీటుని ఆయనకు ఇచ్చారు. ఆయన గెలవలేకపోవచ్చు కానీ కేసీఆర్‌ తనకు ఏకంగా ఎంపీ సీటు ఇస్తారని బహుశః ఆయన కలలో కూడా ఊహించి ఉండరేమో?

నాగర్‌కర్నూల్‌ సిట్టింగ్ బిఆర్ఎస్ ఎంపీ పి.రాము ఇటీవలే బీజేపీలో చేరిపోయారు. ఈసారి అక్కడి నుంచి ఆయన కుమారుడు బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. కనుక నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేయడానికి కూడా బిఆర్ఎస్ పార్టీలో ఎవరూ లేరు. కనుక పొత్తులు పెట్టుకుందామని వచ్చిన రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్‌కి నచ్చజెప్పి ఆ పార్టీకి రాజీనామా చేయించి తన పార్టీలో చేర్చుకొని ఆ టికెట్‌ ఇచ్చారు!

ఆరు నెలల్లో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామని కేటీఆర్‌, హరీష్ రావు ద్వారా కేసీఆర్‌ చెప్పించారు. కానీ బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే ఆరు నెలల్లోనే అదే తెలంగాణ నుంచి కనుమరుగు అయ్యేలా ఉంది.

చంద్రబాబు నాయుడుని, రేవంత్‌ రెడ్డిని చివరికి ప్రధాని నరేంద్రమోడీని కూడా చాలా దారుణంగా హేళన చేసిన కేసీఆర్‌కు, ఇంత తక్కువ సమయంలో ఇటువంటి దయనీయ పరిస్థితి వస్తుందని బహుశః ఆయన కూడా ఊహించి ఉండరు.

ADVERTISEMENT
Latest Stories