సుమారు నాలుగేళ్ళ తర్వాత తొలిసారిగా చంద్రబాబు నాయుడు తెలంగాణ టిడిపి అధ్యర్యంలో బుదవారం ఖమ్మంలో బహిరంగసభ నిర్వహిస్తే వేలాదిగా జనాలు తరలివచ్చారు. దానిలో ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని, బిఆర్ఎస్ పార్టీని పల్లెత్తుమాట అనలేదు. తెలంగాణ కోసం తానేమీ చేశారో, టిడిపి హయాంలో హైదరాబాద్ ఎంత అభివృద్ధి జరిగిందో మాత్రమే చెప్పుకొన్నారు. కనుక బిఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు.
కానీ రాష్ట్రంలో టిడిపి ఉనికే లేకుండా చేశామనుకొన్న బిఆర్ఎస్ నేతలకి నాలుగేళ్ళ విరామం తర్వాత చంద్రబాబు నాయుడు నిర్వహించిన మొదటి బహిరంగసభకి వచ్చిన జనాలను చూసి కంగుతిన్నారు. అంతే… ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరుకొన్న కల్వకుంట్ల కవిత చంద్రబాబు నాయుడి ప్రయత్నాలు ఫలించావంటూ జోస్యం చెప్పేశారు. నలుగురు మంత్రులు హడావుడిగా తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలని మోసగించారని, బిజెపితో పొత్తుల కోసమే తెలంగాణలో రాజకీయాలు చేసేందుకు సిద్దం అవుతున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మిగిలినవారు కూడా ఆయనపై విరుచుకు పడుతున్నారు.
తెలంగాణని కేసీఆర్, బిఆర్ఎస్ నేతలు ఓ రాష్ట్రంగా కాక తమ సొంత రాజ్యంగా, దానికి కేసీఆర్ చక్రవర్తిగా భావిస్తుంటారు. అందుకే ఆయన తెలంగాణలో కాంగ్రెస్, టిడిపిలని నిర్వీర్యం చేశారు. తెలంగాణపై ఎప్పటికీ సర్వాధికారాలు తమవేనని కనుక తమ రాజ్యంలోకి ఎవరూ ప్రవేశించడానికి వీలులేదన్నట్లు మాట్లాడుతుంటారు. అందు కోసం ఒక్కో పార్టీపై ఒక్కో రకం ముద్ర, ఒక్కో రకమైన నిందలు వేస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని కూడా అదేరకంగా నిందిస్తున్నారు.
అయితే ఆనాడు చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించి హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఏర్పాటు చేసి ఐటి కంపెనీలను ఏర్పాటు చేశారు కనుకనే, కేసీఆర్ హైదరాబాద్ లేని తెలంగాణ రాష్ట్రం మాకొద్దని పట్టుబట్టి హైదరాబాద్ తీసుకొన్నారు. నేటికీ హైదరాబాద్ నగరమే తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తోందని అందరికీ తెలుసు. ఆ ఆదాయమే లేకపోతే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసుకోగలిగేవారా ఇన్ని సంక్షేమ పధకాలు అమలుచేయగలిగేవారా? కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణకి చేసిందేమీ లేదని నేడు మంత్రులు వాదిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోకి మరో పార్టీ అడుగుపెట్టకూడదని కోరుకొంటున్నప్పుడు కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కావాలి కదా? కానీ ఆయన బిఆర్ఎస్ పార్టీతో ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలో అన్ని రాష్ట్రాలలో రాజకీయాలు చేయవచ్చట! అదంతా దేశోద్ధారణ కోసమే నమ్మమంటున్నారు!
ఆయన మాటలకి ఏపీలో సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారు తాన తందానా అంటుంటే, ఖమ్మంలో చంద్రబాబు నాయుడు బహిరంగసభలో వెలవెలపోయింది… కల్వకుంట్ల కవిత ఆయనని కడిగిపడేసింది అంటూ అప్పుడే ఆత్మసాక్షి ఘోషించడం మొదలుపెట్టేసింది! చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రులు చేస్తున్న విమర్శలు ఏపీలో వైసీపీకి టానిక్‌లా పనిచేస్తుందని వేరే చెప్పక్కరలేదు. కనుక తెలంగాణ మంత్రులు చేస్తున్న వాదనలపై వారు స్పందిస్తారని వేరే చెప్పక్కరలేదు. అయితే ఏపీని కోలుకోలేనివిదంగా దెబ్బ తీసి, వైసీపీ ప్రభుత్వాన్ని, దాని పాలనని ఈసడించుకొంటున్న బిఆర్ఎస్ నేతలకి వైసీపీ నేతలు భజన చేస్తుండటం విడ్డూరమే కదా?



