ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉన్న బిఆర్ఎస్ నేడు ఒక యువ నాయకుడి చేత చావు దెబ్బ తిని పార్టీ ఉనికి కోసం, రాష్ట్రంలో పట్టు కోసం తహతహలాడుతోంది.
అలాగే తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో పార్టీలతో పొత్తులు పెట్టుకుని, పోరాటాలు చేసిన అదే బిఆర్ఎస్ నేడు సొంతింటి పోరుతో, పార్టీలో ఆధిపత్య కుమ్ములాటలతో అల్లాడుతోంది, పార్టీ విలీనం అనే విమర్శలతో ఉలిక్కి పడుతుంది.
కవిత అరెస్టు తో బిఆర్ఎస్ లో మొదలైన ప్రకంపనలు, కవిత తిరుబాటుతో తారాస్థాయికి చేరుకున్నాయి. బిఆర్ఎస్ కీలక నాయకులు, కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు, కల్వకుంట్ల కుటుంబానికి బంధువు అయిన హరీష్ రావు, సంతోష్ రావు లను టార్గెట్ చేస్తూ బిఆర్ఎస్ పై కవిత చేసిన ఆరోపణలకు అధిష్టానం కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు వెళ్లాయి.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో కేసీఆర్ తన సొంత కూతురు ని కాదనునుకుని, ఆమె రాజకీయ భవిష్యత్ ను సైతం పణంగా పెడుతూ మేనల్లుడైన హరీష్ కు మద్దతుగా నిర్ణయం తీసుకన్నారు అంటే కేసీఆర్, హరీష్ కు భయపడుతున్నారా.? లేక కేసీఆర్ దృష్టిలో బిఆర్ఎస్ కు కవిత కంటే హరీషే ముఖ్యమని భావిస్తున్నారా.?
జరిగిన పరిణామాల పై అధిష్టానం తన వివరణ అడగకుండానే తనకు ఉరి తీసింది అంటూ కవిత, కేసీఆర్ నుంచి తనకొచ్చిన రిటర్న్ గిఫ్ట్ మీద ఆవేదన వ్యక్తం చేస్తూనే, ఎదో ఒక రోజు ఇదే రిటర్న్ గిఫ్ట్ హరీష్ రావు నుంచి కేటీఆర్, కేసీఆర్ లు కూడా ఎదుర్కోబోతున్నారు అంటూ సంచలనమైన ఆరోపణలు చేసారు.
అయితే హరీష్ పై ఈ స్థాయి ఆరోపణలు చేసినా కేసీఆర్, కవిత ను కాదని హరీష్ కే జై కొట్టారు. వై.? ఇప్పుడు ఈ ప్రశ్నే కల్వకుంట్ల అభిమానులను కలవరపరుస్తోంది. హరీష్ ను కాదని కేసీఆర్ రాజకీయంగా ముందుకెళితే అది బిఆర్ఎస్ పార్టీకి పాడికట్టినట్టే అవుతుంది అనే భయం కేసీఆర్ ని వెంటాడుతుందా.?
అయితే గత కొన్నేళ్లుగా బిఆర్ఎస్ పార్టీలో హరీష్ తనకంటూ ఒక సొంత కుంపటి ఏర్పాటు చేసుకున్నారని, కేసీఆర్ తనను కాదని బిఆర్ఎస్ పూర్తి బాధ్యతలు తన వారసుల చేతిలో పెట్టగానే హరీష్ బిఆర్ఎస్ ను రెండుగా చీల్చి తన వర్గం నేతలతో వేర్పాటు వాదం సృష్టిస్తారని,
తద్వారా కేటీఆర్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంలో పడుతుందని ఇలా ఎన్నో ఉహాగాలను తెలంగాణ రాజకీయాలలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి, అలాగే బిఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలు సైతం బిఆర్ఎస్ కు కట్టప్ప హరీషే అంటూ హరీష్ తన వర్గం నేతలతో బీజేపీ లో చేరబోతున్నారు, కాంగ్రెస్ లో టచ్ లో ఉన్నారు, సొంత కుంపటికి సిద్ధమయ్యారు అంటూ ఇలా అనేకానేక ప్రచారాలు తెలంగాణ రాజకీయాలలో బలంగా పాతుకుపోయాయి.
ఈ పరిణామాలతో ఆ ఊహాగానాలకు కేసీఆర్ కూడా తలవంచుతున్నారని, అందుకే ఇప్పటి వరకు పార్టీ బాధ్యతలను, బిఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యరిత్వాన్ని కేటీఆర్ కు అప్పగించలేదనే వాదన బిఆర్ఎస్ లో సైతం బలంగా వినిపిస్తుంది. దీని బట్టి కవిత తిరుగుబాటు కన్నా హరీష్ తెరవెనుక రాజకీయం బిఆర్ఎస్ ను మరింత పతనం చెయ్యగలదు అని కేసీఆర్ భావించారా.?
అందుకే రక్త సంబంధాన్ని కాదని రాజకీయ బంధానికే ఓటేశారా.? కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా కవిత ను ఎంత దూరం తీలుసుకెళ్తుందో కేసీఆర్ ఊహించారా.? అది పార్టీకి హరీష్ ను దూరం చేసుకునేంత నష్టం చేకూర్చలేదని విశ్వసించారా.?
కవిత తిరుగుబాటు రానున్న రోజులలో బిఆర్ఎస్ కు ఎలాంటి విపత్తులు తెచ్చిపెడుతుందో అన్న భయం కంటే కూడా హరీష్ రావు వేసే రాజకీయ అడుగులే ప్రస్తుత బిఆర్ఎస్ ను ప్రమాదంలోకి నెట్టేయగలదు అన్న భయమే కేసీఆర్ ను వెంటాడుతుందా.?




