మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ లో డ్రగ్స్ కలకలం బిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఇరకాటంలో పడేసింది. బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి చెందిన ఈ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో పాల్గొన్న 11 మందిలో 6 మందికి డ్రగ్స్ పాజిటివ్ రావడం, అందులో బిఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి పేర్లు ఉండడంతో బిఆర్ఎస్ పేరు మీడియాలో విస్తృతంగా వినిపిస్తుంది.
అయితే ఈ డ్రగ్స్ దందా పై ప్రభుత్వం విచారణకు సిట్ ని నియమించగా, అందులో రోహిత్ రెడ్డి పేరు ని A1 నమోదుచేశారు. అలాగే ఫామ్ హౌస్ లో పార్టీ నిర్వహించింది, ఆ పార్టీకి డ్రగ్స్ అందించింది కూడా రోహిత్ రెడ్డే అంటూ మీడియాలో కథనాలు ప్రచారమవుతున్నాయి.
అలాగే ఈ కేసులో రోహిత్ కు, ఆయన సోదరుడికి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఇక తాజాగా నేడు సిట్ అధికారులు రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హౌస్ ని, ఆ పార్టీలో పాల్గొన్న వ్యక్తుల వాహనాలను సీజ్ చేసింది. గతంలో కూడా సదరు ఫామ్ హౌస్ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలతో వార్తలలో నిలవడం, ఆ ఫామ్ హౌస్ నిర్మించిన స్థలం కూడా అసైన్డ్ భూమి అని తేలడంతో అధికారులు ఫామ్ హౌస్ ని సీజ్ చేసారు.
ఇదిలా ఉంటే, అలాగే ఇటు హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేరు కూడా తరచూ ఏదోఒక వివాదంతో మీడియాలో హల్చల్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత విమర్శలు, కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు, సమ్మక్క – సారక్క జాతర సమయంలో చేసిన రచ్చతో కౌశిక్ రెడ్డి నిత్యం వార్తలలో నిలుస్తున్నారు.
కౌశిక్ చర్యలతో హుజారాబాద్ నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్, కింద స్థాయి నాయకులు విసిగిపోతున్నారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలతో పార్టీ క్యాడర్ ఆయన పై తిరుబాటు జెండా ఎగరేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో పార్టీ కి అండగా నిలిచిన క్యాడర్ ని కింద స్థాయి నాయకులను కౌశిక్ రెడ్డి విస్మరిస్తున్నారని, కేవలం ఆయన అనుచరులకు మాత్రమే పెద్ద పిటా వేస్తూ ఇతర బిఆర్ఎస్ శ్రేణులను పట్టించుకోవడంలేదని,
దీని ఫలితంగా స్థానిక బిఆర్ఎస్ క్యాడర్ రెండుగా చీలిపోయిందని, అందులో ఒక వర్గం ఇప్పటికే అధికార కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతుందని, ఇది భవిష్యత్ లో బిఆర్ఎస్ అస్తిత్వానికి ఎదురుదెబ్బగా మారుతుందంటూ బిఆర్ఎస్ జిల్లా నాయకులు పార్టీ అధిష్టానానికి విన్నవించుకుంటున్నారు.
ఇలా బిఆర్ఎస్ లో అతంతర్గత కుమ్ములాటలతో కౌశిక్ ‘రెడ్డి’, ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీతో రోహిత్ ‘రెడ్డి’ పేర్లు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియా నోళ్ళల్లో పెద్ద ఎత్తున నానుతున్నాయి.






