ఘోర పరాజయం తరువాత తెలుగుదేశం పార్టీ తరపున యాక్టీవ్ గా ఉన్న నేతలలో బుద్ధా వెంకన్న ఒకరు. మీడియా ముందే కాకుండా ట్విట్టర్ లో కూడా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ ఉంటారు. ఈరోజు ఆయన సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి పై విరుచుకుపడ్డారు.
రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని ఆయన గట్టిగా గళం విప్పుతున్నారు. దీనితో రెండు మూడు సార్లు ఆయనను ప్రభుత్వం హౌస్ అరెస్టు కూడా చేసింది. గతంలో దోచుకున్న సొమ్మంతా సీబీఐ, ఈడీ అటాచ్‌మెంట్ చేసే సరికి మూడు రాజధానుల పేరుతో జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త ఎత్తుగడ వేశారని మండిపడ్డారు. ‘
‘బినామీల పేరుతో విశాఖలో భారీ భూ కుంభకోణానికి తెరలేపారు. మరో రూ.50వేల కోట్లు రాజధాని పేరుతో కొట్టేయడానికి మూడు రాజధానులు ముద్దు అంటూ మరోసారి తన మార్క్ ముద్దుల ర్యాలీలకు తెరలేపారు. విశాఖలో జరుగుతున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆధారాలతో సహా బయటకు రావడం ఖాయం. వడ్డీతో సహా జగన్, 8 నెలల నుంచి విశాఖలో ఉండి ల్యాండ్ మాఫికా కింగ్ పిన్‌గా మారిన విజయసాయిరెడ్డి ఊచలు లెక్కపెట్టడం ఖాయం’’ అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
ఇది ఇలా ఉండగా ఎల్లుండి హై పవర్ కమిటి మూడు రాజధానుల ప్రతిపాదనపై రిపోర్టు ఇచ్చే అవకాశం ఉంది. అదే రోజున మంత్రివర్గ సమావేశంలో ఆ రిపోర్టుని ఆమోదించే అవకాశం ఉంది. 20 నుండి 22 వరకు మూడు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశంలో రిపోర్టుని ఆమోదించి మూడు రాజధానుల ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.





