జస్ట్ ఆస్కిన్గ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించడం, వేరొకరి పై విమర్శలు చేయడం, భావప్రకటన స్వేచ్ఛ పేరుతో కులాల మధ్య మతాల మధ్య రాజకీయాలు చేయడం చాలా సులువైన పని. ఇందుకోసం పెద్దగా జ్ఞానం సంపాదించాల్సిన పనిలేదు, కానీ ఉన్న జ్ఞానాన్ని వాడకుండా ఉంటే చాలు.
అయితే అదే ఆస్కింగ్ తిరిగి మన వైపు వచ్చి ఆన్సరింగ్ అంటే మాత్రం తట్టుకోలేరు, ప్రశ్నించిన గొంతులపై ఎదురుదాడులు చేయడం, చప్పట్లు కొట్టి జారుకోవాలనుకోవడమే మేధావితనంగా భావించేవారు సమాజంలోనే కాదు సోషల్ మీడియాలో కూడా కోకొల్లలుగా ఉంటారు.
ఎదుటివారిని ప్రశ్నించడం మా జన్మ హక్కు, అదేవిధంగా ఇతరుల ప్రశ్నలకు జవాబు చెప్పకపోవడం కూడా మా హక్కే, అంటూ ఇతండవాదన ఆడే వారిని సినీ భాషలో చెప్పాలంటే ఒక సినిమాలో నటుడు ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్ ‘నేను మోనార్క్’ అనే డైలాగ్ గుర్తుకొస్తుంది. ఇపుడు అటువంటి మోనార్కులు రంగులు మార్చుకుంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు.
అయితే మేధావి వర్గం గా భావించే ఈ సోకాల్డ్ వ్యక్తులు తమ జస్ట్ ఆస్కింగ్ కు పరిమితులు విధిస్తారు. ఆ జస్ట్ ఆస్కింగ్ పోస్టులు ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే, ఇక్కడ ప్రభుత్వ పెద్దల మీద విమర్శలు సంధించడానికే, మరీముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడానికే అన్నట్టుగా ఉంటాయి.
సోషల్ మీడియాలో జర్నలిస్టుల ముసుగులో పవన్ కళ్యాణ్ మీద అవాకులు చవాకులు వాగే వారికీ ఈ మేధావుల నుంచి మద్దతు పుష్కలంగా లభిస్తుంది. అలాగే విమర్శకుల రూపంలో పవన్ మీద బూతులతో విరుచుకుపడే వారికి అండగా నిలబడేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించరు.
ఇక పవన్ ను రాజకీయంగా ఎదురుదెబ్బ తీయడానికి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కూడా వీరి దృష్టిలో భావప్రకటన స్వేచ్ఛే అవుతుంది. అయితే ఇటువంటి వారి పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, అధికారులు అరెస్టులు చేస్తే మాత్రం అప్రజాస్వామ్యం అంటూ గగ్గోలు పెట్టేస్తారు, అన్యాయం అంటూ గొంతెత్తేస్తారు.
అయితే ఆ గగ్గోలు కూడా కేవలం ఏపీ ప్రభుత్వానికి మాత్రమే పరిమితం. ఉప ముఖ్యమంత్రి పవన్ టార్గెట్ గా సీఎం బాబు కేంద్రంగా ప్రశ్నల రూపంలో సోషల్ మీడియాలో ముసుగులో జరుగుతున్న ఉన్మాదం పై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు చట్టం తన పని తానూ చేస్తూ పోతుంది.
అయితే ఆ సోషల్ మీడియా ఉన్మాదుల అరెస్టులను ఖండిస్తూ జస్ట్ ఆస్కింగ్…ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ ఒకరు.? ప్రశ్నిస్తే కేసులు పెడతారా.? అంటూ మరొకరు, తెలంగాణ వారి పై ఏపీ జులం ఏంటి అంటూ ఇంకొకరు ఇలా గుంపులు గుంపులుగా కూటమి ప్రభుత్వం పై మూకుమ్మడి దాడి చేస్తున్నారు.
అయితే తాజాగా తమిళనాడు లో కూడా ఇటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్, సినీ నటి త్రిష మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను విపక్ష డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధా కృష్ణన్ పై టీవీకే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అక్కడి పోలీసులు సదరు మాజీ మంత్రిని అరెస్టు చేసారు.
అయితే ఆ అరెస్టు పై ఈ జస్ట్ ఆస్కింగ్ మేధావుల గొంతు మూగబోయింది. ఏపీలో అటువంటి భాషా ప్రయోగానికి మించి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని అరెస్టులు చేస్తుంటే కక్ష్య సాధింపు చర్యలు అంటున్న వారు అదే తమిళనాడు ప్రభుత్వం చేస్తే మాత్రం గొంతెత్తరు.?
రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు సహించరాని నేరం, అది ఏపీలో అయినా తెలంగాణలో చేసినా తమిళనాడులో చేసినా అటువంటి వారి నోటి దూలకు తగిన శిక్షలు పడాల్సిందే. అప్పుడే మరొకరు ఇటువంటి విమర్శలు చేసేందుకు సాహసించరు.
కానీ ఈ జస్ట్ ఆస్కింగ్ సోషల్ మీడియా మేధావి వర్గం మాత్రం ఏపీలో అరెస్టులను నేరం అంటూ గాండ్రిస్తూ తమిళనాడులో న్యాయం అంటూ మౌనంగా ఉండడం దేనికి సంకేతం అవుతుంది.? ఈ మినహాయింపు రాజకీయాలు, కన్వీనియంట్ పాలిటిక్స్ ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం.? ఎవరి ముఖంలో చిరునవ్వు కోసం.? ఊరికే తెలుసుకోవడానికి జస్ట్ ఆస్కింగ్ అంతే సుమీ…!






