చంద్రబాబు నాయుడు పాఠాలు…రేవంత్ విజయానికి బాటలు అంటే చాలా మందికి నచ్చకపోవచ్చు. కానీ ఒకవేళ రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్ద శిష్యరికం చేసి ఉండి ఉంటే నేడు ఈ స్థాయిలో ఉండేవార? ఇలాగే ఉండేవారా?అంటే కాదనే అర్ధమవుతుంది.
కనుక సిఎం రేవంత్ రెడ్డి ఆలోచన ధోరణి, నడవడిక, అందరినీ కలుపుకుపోయే గుణం, ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలనే పరిణతి చంద్రబాబు నాయుడు శిష్యరికంలో నేర్చుకున్నవే అనుకుంటే రేవంత్ రెడ్డి విజయానికి ఇవే బాటలు వేశాయంటే తప్పు కాదు కదా?
సినీ, రాజకీయ, పారిశ్రామిక, వ్యాపార రంగాలలో రాణించాలంటే దశాబ్దాల పాటు పట్టుదలగా పనిచేసే ఓపిక ఉండాలి. అవకాశాలను అందిపుచ్చుకునే నేర్పు, సమస్యలు, సవాళ్ళను ఎదుర్కొని నిలబడగలిగే ధైర్యం కావాలి. అన్నిటికీ మించి అదృష్టం, దేవుడి దయ కూడా ఉండాలి.
అలా రాజకీయాలలో స్వయంశక్తితో రాణించిన వ్యక్తి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి. 2006, జూలై 4న మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి టీడీపిలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఎంపీ అయ్యారు. ఆ పార్టీ పగ్గాలు చేపట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు.
టీడీపిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యరికంలో నేర్చుకున్న రాజకీయ పాఠాలు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత చాలా ఉపయోగపడ్డాయి.
తెలంగాణ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వమే. కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. పైగా కేసీఆర్ సిఎం కాగానే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారినప్పటికీ కాంగ్రెస్ నాయకుల మధ్య ఐఖ్యత, పరస్పర నమ్మకం, అవగాహన లేకుండా పోయింది. టికెట్లు, పదవుల కోసం కుమ్ములాడుకోవడం అలవాటుగా మారింది.
సమస్యలు, సవాళ్ళలోనే అవకాశాలు వెతుక్కోవాలి… అందరితో విభేదించడం కాదు.. అందరినీ కలుపుకుపోవాలనే చంద్రబాబు నాయుడు వద్ద నేర్చుకున్న పాఠాలు పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డికి బాగా అక్కరకు వచ్చాయి.
తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న ఈ అంతర్గత సమస్యలను గుర్తించిన రేవంత్ రెడ్డి ముందుగా వాటిని పరిష్కరించడానికి నడుం బిగించారు. ఇంతమంది హేమాహేమీలున్నప్పటికీ పరస్పరం కుమ్ములాడుకోవడం వలననే కేసీఆర్ చేతిలో ఓడిపోతున్నామనే విషయం అందరికీ అర్ధమయ్యేలా చేశారు.
వానర సైన్యం వంటి కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను వెంటబెట్టుకొని తనతో యుద్ధానికి వచ్చిన రేవంత్ రెడ్డిని చూసి కేసీఆర్ చాలా పరిహసించారు.
కానీ నాడు శ్రీరాముడు కూడా ఇలాగే వానరసేనతో సముద్రం దాటి వచ్చి రావణుడిని వధించి లంకని జయించాడు. అలాగే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీని ఓడించింది.
అయితే రేవంత్ రెడ్డి గెలుపుని ‘గాలివాటం’గా అభివర్ణించిన కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని, మళ్ళీ తాను సిఎం అవుతానని కేటీఆర్, హరీష్ రావుల చేత ప్రగల్భాలు పలికించారు. కానీ రెండున్నరేళ్ళుగా కేసీఆరే ఫామ్‌హౌసులో నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.
వచ్చే ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీని ఓడించి మళ్ళీ నేనే సిఎం అవుతానని రేవంత్ రెడ్డి శపథం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ దాని అధినేత కేసీఆర్ పరిస్థితి చూస్తుంటే రేవంత్ రెడ్డి ఈ శపథం కూడా తప్పక నెరవేర్చుకుంటారనిపిస్తుంది.
ఎందుకంటే ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలను, అటు ఢిల్లీలో కాంగ్రెస్, బిజేపి పెద్దలతో కూడా సఖ్యతగా ఉంటూ అందరినీ కలుపుకొని ముందుకు సాగిపోతున్నారు కనుక!






