హైదరాబాద్‌లో గురువారం రాత్రి ఓ దంపతులు రైలు కింద పది ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన రవి (42), శిరీష (33)దంపతులుగా పోలీసులు గుర్తించారు. వారు కొంత కాలం క్రితం హైదరాబాద్ వలస వచ్చారు.
బియ్యం వ్యాపారి అయిన రవిని ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి తన వ్యాపారంలో భాగస్వామిని చేసుకుంటానని చెప్పి 15 లక్షలు తీసుకొని మోసం చేశాడు. అడిగితే బెదిరించేవాడు.
ఒకేసారి అంత డబ్బు పోగొట్టుకోవడంతో ఆ దంపతులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ మోసాన్ని, నష్టాన్ని, మనస్థాపాన్ని భరించలేక గురువారం రాత్రి భార్యాభర్తలిద్దరూ ఘాట్ కేసర్-బీబీ నగర్ మద్య కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు ఎదురు వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దంపతులకు 12, 13 ఏళ్ళు వయసున్న ఇద్దరు కుమారులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఈవిధంగా ఒకరి చేతిలో మోసపోయి ఆర్థిక సమస్యలలో చిక్కుకోవడం, ప్రాణాలు తీసుకోవడం చాలా బాధాకరమే. కానీ తల్లితండ్రులు ఆత్మహత్య చేసుకుంటే ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏమిటి?
తల్లిదండ్రులను కోల్పోయిన వారిరువురూ హటాత్తుగా అనాధలుగా మారిపోయారు. ఈ వయసులో ఇటువంటి షాక్ వారు తట్టుకోగలరా? లేకుంటే అది మరో సమస్యగా మారుతుంది కదా?
కనుక ఎన్ని సమస్యలున్నా తల్లిదండ్రులు తమ పిల్లలు, వారి జీవితాల గురించి కూడా ఆలోచిస్తే క్షణికావేశంలో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆగుతారు.
కానీ పిల్లలు ఇంకా తమపైనే ఆధారపడి ఉన్నారని, కనుక వారి పూర్తి బాధ్యత తమపైనే ఉందని తెలిసీ ఇద్దరూ ప్రాణాలు తీసుకోవడం అంటే పిల్లల బాధ్యతల కంటే మా బాధలే మాకు ముఖ్యం అని అనుకున్నట్లనిపిస్తుంది.
కన్న తల్లిదండ్రులే పిల్లల గురించి ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంటే బంధుమిత్రులు ఆ బాధ్యత తీసుకుంటారా? అలా అనుకోవడం సబబేనా?అని ఆ తల్లితండ్రులు ఆలోచించి ఉండి ఉంటే ఆత్మహత్య చేసుకునేవారే కారు.
కనుక ఆత్మహత్యతో ఒకరి సమస్యలు ముగిసిపోవచ్చు. కానీ వారిపై ఆధారపడున్న ఇతరులకు కొత్త సమస్యలు సృష్టించి వారి బతుకులు దయనీయంగా మార్చేస్తాయని ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ప్రతీ ఒక్కరూ గ్రహించడం చాలా అవసరం.






