స్థానిక ఎన్నికల సమరంలో కూటమి పార్టీలలో భాగమైన టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంచాయితీలు, రెండు పార్టీల మధ్య అవసరమైతే ఫ్రెండ్లీ పోరు అంటూ బయటకొచ్చిన వార్తలతో వైసీపీ తన గెలుపు పై కాస్త ఆశలు పెంచుకుంది. అందుకు తగ్గట్టే పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తుంది.
ఈ నేపథ్యంలో తాజాగా నేడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు తమ తమ పార్టీ అధినేతల హోదాలో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇరు పార్టీలు అవలంభించవల్సిన వ్యూహాలు, ఎవరు ఎక్కడ నుంచి పోటీ చెయ్యాలి,
గత సార్వత్రిక ఎన్నికల నాటి ఫలితాలు తిరిగి పునరుద్దరించడానికి అవసరమైన అన్ని అంశాల పై ఈ ఇరువురు నేతలు చర్చించినట్టు సమాచారం. కూటమి పొత్తు కేవలం ఒక్క ఎన్నికల కోసం కాదని, రాబోయే పదేళ్లు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ఆశిస్తున్న ఈ ఇరువురు నేతల భేటీ సక్సెస్ అయితే వైసీపీ ఆశలు ఫెయిల్ అయినట్టే అంటున్నారు కూటమి మద్దతుదారులు.
టీడీపీ, జనసేన కలిస్తే అది వైసీపీ కి రాజకీయ సమాధే అవుతుందనేది వైసీపీ శ్రేణులు కూడా ఒప్పుకునే వాస్తవం. ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంచాయితీ అంటూ వచ్చిన వార్తలు, బలం ఉన్న చోట వెనక్కి తగ్గేదెలా, టీడీపీ తో అయినా సరే ఫ్రెండ్లీ పోటీ అంటూ పవన్ చేసిన ప్రకటనలు వైసీపీలో కొత్త ఆశలను చిగురింపచేశాయి.
అయితే నాటి ఇరు పార్టీ నేతల ప్రకటనలతో వైసీపీ లో కనిపించిన ఆ ఉత్సాహం నేటి ఈ ఇరువురు నేతల భేటీలతో ఆవిరయ్యేలా ఉంది. ఇప్పటికే ఒకపక్క పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం, అటు పక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులతో ప్రజలలోకి దూసుకెళ్లడంతో వైసీపీ రాజకీయంగా కాస్త వెనకడుగు వేసే పరిస్థితిలో పడింది.
ఇటువంటి సందర్భంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా వైసీపీ తన పరువు కాపాడుకోలేకపోతే క్షేత్ర స్థాయిలో వైసీపీ రాజకీయంగా మరింత బలిహనపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీనితో బాబు – పవన్ భేటీ సక్సెస్ మీదే వైసీపీ రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది అనేది జగమెరిగిన సత్యమే.





