కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి నేడు ఓ అగ్నిపరీక్ష ఎదుర్కోక తప్పడం లేదు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆమె సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య చాలా కాలంగా ఆస్తుల పంచాయతీ నడుస్తోంది. తాజాగా ఆమె బెంగళూరులోని తమ ఉమ్మడి ఆస్తి యలహంక ప్యాలస్‌లో తన భాగంలో కూతురు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు.
కానీ జగన్మోహన్ రెడ్డి తన భద్రతా కారణాలతో ఆ పెళ్ళికి అనుమతి నిరాకరించడమే కాకుండా, దానిలో ఆమె, కుటుంబ సభ్యులు ఎవరూ అడుగు పెట్టరాదని కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయించారు.
దీంతో వైఎస్ షర్మిల మరింత అసహనానికి గురయ్యారు. తన అన్న చర్యలకు నిరసనగా నేడు యలహంక ప్యాలస్ ఎదుట ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారని, ఆమెతో పాటు తల్లి విజయమ్మ కూడా ధర్నాలో పాల్గొంటారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
విజయమ్మ సంగతి ఇంకా తెలియదు కానీ వైఎస్ షర్మిల మాత్రం అదివారం సాయంత్రం బెంగళూరు విమానాశ్రయం చేరుకున్నారు.
అయితే కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది కనుక ఆమెను అడ్డుకొని తిప్పి పంపించేసేందుకు బెంగళూరు విమానాశ్రయం వద్ద భారీగా పోలీసులు మొహరించారు.
కానీ ఆమె అంత త్వరగా వెనక్కు తగ్గే మనిషి కాదు. కనుక ఒకవేళ పోలీసులను ఎదిరించి యలహంక చేరుకునేందుకు ప్రయత్నిస్తే అడ్డుకొని బలవంతంగా తిప్పి పంపక తప్పదు.
ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. పైగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు వైఎస్ కుటుంబ సభ్యులు అందరితో మంచి పరిచయాలున్నాయి. ముఖ్యంగా విజయమ్మ, జగన్, షర్మిల ముగ్గురితో సత్సంబంధాలు ఉన్నాయి.
కనుక సాటి కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఆమెను అడ్డుకోవడం ఆయనకు ఇబ్బందికరమే. అలాగని కోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా ఆమెను అనుమతించలేరు. ఒకవేళ అనుమతిస్తే కోర్టు ధిక్కారం అవుతుంది. జగన్‌కు కోపం వస్తుంది. కనుక పోలీసులు అడ్డుకుంటే వైఎస్ షర్మిల ఏమంటారో? బెంగళూరులో ఏం జరుగబోతోందో?





